C-Section Delivery Dos And Donts: మాతృత్వ ప్రయాణంలో తల్లి, బిడ్డల క్షేమమే వైద్యులకు అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత. తల్లికి అధిక రక్తపోటు (High BP), ఇతర వైకల్య వైద్య పరిస్థితులు ఉండటం, మాయ గర్భసంచి ద్వారానికి దగ్గరగా ఉండటం (Low placenta), బిడ్డ అడ్డంగా లేదా ఎదురు కాళ్లతో ఉండటం, రక్తప్రసరణలో తేడాలు, బిడ్డ చిన్నగా లేదా పెద్దగా ఉండటం, కవల పిల్లలు ఉండటం లేదా గతంలో గర్భసంచికి శస్త్రచికిత్సలు జరిగి ఉండటం వంటి కారణాల వల్ల వైద్యులు ముందస్తుగా సిజేరియన్ సూచిస్తారు.
అలాగే సాధారణ ప్రసవ ప్రయత్నంలో తల్లికి ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావడం, బిడ్డ గుండె స్పందనలో (Heart beat) వ్యత్యాసాలు రావడం, గర్భసంచి ద్వారం తెరుచుకోకపోవడం లేదా బిడ్డ తల కిందికి జరగకపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా సిజేరియన్ చేస్తారు. ఇలాంటి సమస్యలపై వివరాలను ఫెర్నాండేజ్ హాస్పటల్‌లోని ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ శ్వేత పద్మ మాటల్లో తెలుసుకుందాం.
ఆపరేషన్ నిర్వహణ విధానం, సమస్యలు..
సిజేరియన్ సమయంలో వెన్నుపూస కింది భాగంలో ఇచ్చే స్పైకల్ లేదా ఎపిడ్యూరల్ (Epidural) అనస్థీషియా ద్వారా పొట్ట, కాళ్ల భాగాల్లో కొన్ని గంటల వరకు స్పర్శ తెలియకుండా చేస్తారు. కింది పొట్టపై 12 - 15 సెంటీమీటర్ల మేర అడ్డంగా పెట్టే కోత (బికీనీ కట్) ద్వారా బిడ్డను డెలివరీ చేసి, ఆపై కరిగిపోయే కుట్లతో గాయాన్ని మూసివేస్తారు. ఈ ఆపరేషన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకడం, అధిక రక్తస్రావం కావడం, కాళ్లలో రక్తం గడ్డకట్టడం (DVT), లోపలి పేగులు లేదా మూత్రాశయానికి గాయం కావడం వంటి రిస్కులు తలెత్తవచ్చు.
కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆసుపత్రిలో ఆపరేషన్ అయిన 24 గంటల తర్వాత నడవడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గి, రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్లు తీసుకోవచ్చు. జ్వరం, బిపి నియంత్రణలో ఉండి సజావుగా తిరగగలిగితే 3 నుండి 5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు.
కుట్ల గాయంపై తడి తగలకుండా పొడిగా ఉంచాలి. స్నానం చేశాక మెత్తటి పొడి బట్టతో గాయంపై నెమ్మదిగా అద్దాలి. లూజ్ గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. గాయం ఎర్రగా మారినా, వాపు వచ్చినా, చీము లేదా రక్తం కారినా, జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
ఇంటి వద్ద విశ్రాంతి..
కనీసం 6 వారాల వరకు బిడ్డ బరువు కంటే ఎక్కువ ఉన్న వస్తువులను ఎత్తకూడదు, వంగకూడదు. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు పొట్ట కుట్లపై ఒత్తిడి పడకుండా ఒక దిండును అడ్డంగా పట్టుకోవాలి, డాక్టర్ సలహాతో బెల్ట్ వాడవచ్చు. బిడ్డకు పాలు ఇచ్చాక త్రేన్పించి (Burp), బిడ్డ నిద్రపోయినప్పుడే తల్లి విశ్రాంతి తీసుకోవాలి.
ఆహార నియమాలు: మలబద్ధకం నివారణకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. అలాగే రోజుకు 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగాలి.
వ్యాయామాల పట్టిక
మొదటి 6 వారాలు బరువైన వ్యాయామాలు అస్సలు చేయకూడదు. గదిలో నెమ్మదిగా నడవడం, మంచంపై పాదాలను తిప్పడం వంటివి చేయాలి. 6 వారాల తర్వాత డాక్టర్ అనుమతి పొంది కీగెల్ వ్యాయామాలు (Kegel Exercises), 15 - 20 నిమిషాల వేగవంతమైన నడక ప్రారంభించవచ్చు. 3 నుండి 6 నెలల తర్వాత పొట్ట తగ్గే కఠినమైన వ్యాయామాలు (Crunches) మొదలుపెట్టవచ్చు. 6 నెలల తర్వాత బరువులు ఎత్తే వ్యాయామాలు చేయవచ్చు.
భావోద్వేగ సవాళ్లు, పరిష్కారాలు..
హార్మోన్ల మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి, అలసట, గత అనుభవాల వల్ల పోస్ట్ - పార్టమ్ డిప్రెషన్ రావచ్చు. దీనికి భర్త, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. బిడ్డ నిద్రపోతున్నప్పుడు తల్లి నిద్రపోవడం, అవసరమైతే మానసిక వైద్యుని సలహా తీసుకోవడం, యోగా, మెడిటేషన్, పుస్తకాలు లేదా సంగీతంతో ఒత్తిడిని జయించవచ్చు. ప్రసవ రకం కంటే తల్లి, బిడ్డల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమైనది. ఇతరులతో పోల్చుకోకుండా డాక్టర్ సలహాతో సరైన నిర్ణయం తీసుకోవాలి.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం వైద్యుని సలహా సూచనల మేరకు పొందపరిచాము. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)