విదేశీ యానం గురించి సరైన అవగాహన లేని వారికి IRCTC ఎంతో ఉపయోగపడుతుంది. బడ్జెట్‌లో విదేశీ యానం చేయవచ్చు. ఒంటరిగా లేదా కుటుంబంతో కలిసి గ్రూప్ ట్రిప్ వెళ్లే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. IRCTC 8 రోజుల 'వండర్స్ ఆఫ్ వియత్నాం అండ్ కాంబోడియా' ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ఇది చెన్నై నుండి ప్రారంభమవుతోంది, అయితే బెంగళూరు నుండి కూడా ఇటువంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో పర్యటనతో పాటు అక్కడి చరిత్రను, సౌత్ ఏషియన్ దేశాల అందాలను చూడవచ్చు. ఇందులో టికెట్లు, రవాణా, హోటల్స్, భోజనం, గైడ్ ఎస్కార్ట్ సర్వీస్, వీసా ఛార్జీలతో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ రెండు దేశాలను సందర్శించడానికి 7 రాత్రులు, 8 రోజులకు గాను ధర రూ.1.5 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు.
విదేశీ యానం చేయాలనుకునే వారికి ఇది ఒక బంపర్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. ఈ కాంబోడియా టూర్ మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు ఉంటుంది.
ట్రిప్ వివరాలు..
నవంబర్ 17, 2026న చెన్నై నుండి సింగపూర్ మీదుగా దా నాంగ్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు అక్కడ చేరుకుంటారు. పర్యటన పూర్తయిన తర్వాత, 20వ తేదీన దా నాంగ్ నుండి హనోయ్‌కు వెళ్తారు. హనోయ్ నుండి సియెమ్ రియాప్ చేరుకున్న తర్వాత, పర్యటన ముగించి 25వ తేదీన తిరిగి చెన్నైకి చేరుకుంటారు.
ట్రిప్ సమయాలు, ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. టూర్ బయలుదేరే తేదీ, సమయం, ప్యాసింజర్ బోర్డింగ్, ఫ్లైట్ వివరాలు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఈ రెండు దేశాల్లో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. మార్బుల్ మౌంటెన్స్, మైకే బీచ్, డ్రాగన్ బ్రిడ్జ్, హాన్ రివర్ వంటి దృశ్యాలను దా నాంగ్‌లో చూడవచ్చు. మరుసటి రోజు గోల్డెన్ బ్రిడ్జ్, ఫ్రెంచ్ విలేజ్‌ను కూడా వీక్షించవచ్చు. అక్కడి ఏషియన్ టౌన్స్, ఓల్డ్ స్ట్రీట్స్ , రివర్ సైడ్ దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. మూడవ రోజు దా నాంగ్ నుండి హనోయ్ వెళ్తారు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్, చెక్ అవుట్ చేసిన తర్వాత టెంపుల్ ఆఫ్ లిటరేచర్, హోన్ కీమ్ లేక్, సన్ టెంపుల్‌ను సందర్శించవచ్చు. అలాగే ఓల్డ్ క్వార్టర్స్‌ను కూడా చూడవచ్చు. మరుసటి రోజు హాలోంగ్ బే నుండి పర్యటన ఉంటుంది. అక్కడ మీరు ఐలాండ్స్, కేవ్స్‌ను వీక్షించవచ్చు. అక్కడి నుండి తిరిగి హనోయ్‌కు చేరుకుంటారు. ఓవర్ నైట్ స్టే ఉంటుంది. ఆరవ రోజు హనోయ్ నుండి సియెమ్ రియాప్ వెళ్తారు. అక్కడ రెండు రోజుల పర్యటన తర్వాత చెక్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం ఎనిమిది రోజుల గ్రూప్ ట్రిప్.
ప్యాకేజీ వివరాలు..
సింగిల్ ధర రూ.1,75,200, డబుల్ ఆక్యుపెన్సీ రూ.1,53,750, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.1,51,250 ఉంటుంది. 5 నుండి 11 ఏళ్ల పిల్లల ప్యాకేజీ ధర రూ.1,31,500 నుండి ప్రారంభమవుతుంది.
ఎయిర్‌లైన్స్ ఆపరేషన్ల ఆధారంగా ఫ్లైట్ షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చు. చిన్న పిల్లల కోసం ఎయిర్ ఫేర్ చేర్చలేదు. ప్రయాణికులు పాన్ కార్డు, టీసీఎస్ డిక్లరేషన్ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీపై 2 శాతం TCS వర్తిస్తుంది. రైల్వే లేదా ఎయిర్‌లైన్స్ ఆలస్యం అయినప్పటికీ లేదా క్యాన్సిలేషన్ జరిగినప్పటికీ, సైట్ సీయింగ్ సర్వీసుల విషయంలో ఎలాంటి రీఫండ్ ఇవ్వదని IRCTC పేర్కొంది.