SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మాయమాటలను గుడ్డిగా నమ్మకూడని చెబుతున్న... తోడేలు తంత్రం - కుందేలు అమాయకత్వం నీతి కథ...!!

Moral Story: ఎదుటివారు చెప్పే మాయమాటలను, మోసపూరితమైన ఆశలను గుడ్డిగా నమ్మకూడదు. ఒకసారి ఆపద నుండి బయటపడిన తర్వాత కూడా సమయస్ఫూర్తి, ఆలోచన లేకుండా పదే పదే తప్పు చేస్తే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.

Written By Bhoomi
Published: Oct 16, 2026, 03:19 PM IST | Updated: Oct 16, 2026, 03:21 PM IST
Image Credit: Moral Story
Join

Moral Story: ఒక దట్టమైన అడవికి  ఒక పెద్ద పులి ఉండేది. అడవిలోని జంతువులన్నీ దాని గర్జన వింటేనే భయంతో వణికిపోయేవి. అయితే ఒకరోజు వేటలో ఉండగా ఆ పులి కాలిలో ఒక పదునైన రాతి ముల్లు గుచ్చుకుని తీవ్రమైన గాయమైంది. కాలు వాచిపోవడంతో అది సరిగ్గా నడవలేక, వేటాడలేని స్థితికి చేరుకుంది. ఆ పులి వద్ద ఒక తోడేలు ఎల్లప్పుడూ ఆశ్రయం పొందుతూ ఉండేది. రాజు వేటాడి తెచ్చిన మాంసంలో మిగిలిన భాగాన్ని తింటూ అది కాలం వెళ్ళదీసేది.

కానీ ఇప్పుడు పులి వేటాడే పరిస్థితిలో లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆకలితో పులి నీరసించిపోసాగింది. దాంతో పులి తోడేలును పిలిచి, "తోడేలూ! నా గాయం వల్ల నేను వేటాడలేకపోతున్నాను. మన ఇద్దరికీ ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నువ్వు నీ తెలివితేటలతో ఏదైనా ఒక సాధు జంతువును నమ్మించి, ఆశ చూపి నా గుహ వద్దకు తీసుకురా. నేను దాన్ని ఒక్క దూకుడుతో అంతమొందిస్తాను. దానివల్ల మన ఇద్దరికీ కొన్ని రోజుల పాటు కడుపు నిండా తిండి దొరుకుతుంది" అని చెప్పింది.

తోడేలు ‘సరే మహారాజా!’ అని చెప్పి, ఆహారం కోసం అడవి పొలిమేరలోని ఒక పల్లెటూరి సమీపంలో ఉన్న పొలాల వైపు ప్రయాణమైంది. అక్కడ అటు ఇటూ వెతుకుతుండగా, దానికి చాలా బక్కచిక్కి, అలసిపోయి ఉన్న ఒక అమాయకపు కుందేలు కనిపించింది.

తోడేలు వెంటనే ఆ కుందేలు దగ్గరకు వెళ్ళి నకిలీ జాలితో, "కుందేలు బావా! ఏంటిలా చిక్కిపోయి నీరసంగా ఉన్నావు? సరైన తిండి దొరకడం లేదా?" అని మాయమాటలతో పలకరించింది. దానికి కుందేలు దిగులుగా, "అవును తోడేలు బావా! ఈ పొలాల్లో నాకూ, నా కుటుంబానికి కావాల్సినంత మేత దొరకడం లేదు. మనుషుల భయం ఒకటైతే, ఆకలి మమ్మల్ని నలిపేస్తోంది" అని తన బాధను వెళ్ళబోసుకుంది.

తోడేలు తన ప్లాన్ పక్కాగా పారుతోందని మనసులోనే సంబరపడుతూ, "అయ్యో! దానికి ఎందుకు అంత బాధపడతావు? నాతో పాటు అడవి లోపలికి రా! అక్కడ పచ్చటి తోటలు, రుచికరమైన దుంపలు, తీపి క్యారెట్లు అపారంగా ఉన్నాయి. నువ్వు కడుపు నిండా తినవచ్చు. పైగా అక్కడ నీకు సరిపోయే ఒక అందమైన ఆడ కుందేలు కూడా ఉంది. నీకు వైభవంగా పెళ్ళి చేసి హాయిగా జంటగా బతికేలా చేస్తాను. ఈ కష్టాలు పడేకంటే నాతో వచ్చేయ్!" అని పెద్ద ఆశ చూపించింది.

తోడేలు చెప్పిన మాయమాటలు నిజమేనని నమ్మిన అమాయకపు కుందేలు, ఆశతో తన ప్రాణాల మీదికి ఆపద వస్తుందని గ్రహించకుండా దాని వెంట అడవిలోకి బయలుదేరింది. తోడేలు దాన్ని దారి పొడవునా రకరకాల కబుర్లు చెప్తూ నేరుగా పులి గుహ ముందరకు తీసుకెళ్ళంది. కానీ, గుహ ముంగిట ఆకలితో రగిలిపోతున్న పులిని చూడగానే కుందేలుకు అసలు విషయం అర్థమైంది. భయంతో వణికిపోతూ శరవేగంతో అక్కడి నుండి వెనక్కి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకుంది.

పులికి ఆహారం దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో తోడేలుపై విరుచుకుపడింది. "సరిగ్గా ప్లాన్ చేయలేకపోయారా!" అని గద్దించింది. దాంతో తోడేలు, "మహారాజా! నన్ను క్షమించండి. ఎలాగైనా ఆ కుందేలును మళ్ళీ నమ్మించి తీసుకువస్తాను" అని మాటిచ్చింది.

తోడేలు మళ్ళీ పల్లెటూరి పొలాల వైపు వెళ్ళి ఆ కుందేలును వెతికి పట్టుకుంది. "ఏంటి బావా! నన్ను నమ్మి వచ్చి అంత భయంతో పారిపోయావు? నాతో చెప్పకుండా వచ్చేసావ్?" అని ఏమీ తెలియనట్లు అడిగింది.

"ఆ గుహ దగ్గర పెద్ద పులి ఉంది బావా! నన్ను చంపేస్తుందేమోనని భయపడి పారిపోయాను" అంది కుందేలు వణుకుతూ.

తోడేలు బిగ్గరగా నవ్వుతూ, "అయ్యో అమాయకుడా! అది పులి కాదురా! అడవిలో పచ్చిక మేసి, బాగా బలిసిన ఒక పెద్ద కుందేలు బామ్మ! నువ్వు దాన్ని చూసి పొరపడ్డావు అంతే! దానికి ఒంటి మీద చారలు ఉన్నంత మాత్రాన పులి అయిపోతుందా? రా, నీకేం భయం లేదు!" అని మళ్ళీ కల్లబొల్లి మాటలు చెప్పింది.

దురాశ, పెళ్ళి చేసుకుందామనే ఆశ కుందేలు కళ్ళను కప్పివేసాయి. మొదటిసారి ప్రమాదం నుండి బయటపడినా, నిజానిజాలు ఆలోచించకుండా రెండోసారి కూడా తోడేలు మాటలు నమ్మి దాని వెంట వెళ్ళింది.

ఈసారి గుహ దగ్గరకు రాగానే, పులి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క దూకుడుతో కుందేలుపై పడి దాన్ని పట్టుకుని చంపేసింది.

ఆ తర్వాత పులి, "నేను సమీపంలోని ఏటికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈ లోపు ఈ మాంసానికి నువ్వు జాగ్రత్తగా కాపలా ఉండు" అని తోడేలుతో చెప్పి ఏటి వైపు వెళ్ళింది.

పులి అలా వెళ్ళగానే, తోడేలుకు త్వరగా మాంసం తినాలనే కోరిక పుట్టింది. వెంటనే కుందేలు తల భాగాన్ని పగలగొట్టి, లోపల ఉన్న మెదడును తృప్తిగా, లొట్టలేసుకుంటూ తినేసింది.

స్నానం ముగించుకుని తిరిగి వచ్చిన పులి, కుందేలు కళేబరాన్ని చూసి, దాని తలలో మెదడు లేకపోవడాన్ని గమనించింది. కోపంతో తోడేలు వైపు చూస్తూ, "తోడేలూ! ఇందులో మెదడు ఏది? నువ్వేమైనా తిన్నావా?" అని గద్దించింది.

దానికి తోడేలు చాలా తెలివిగా, "మహారాజా! నా మీద అబద్ధపు నింద వేయకండి! ఆ కుందేలుకు అసలు మెదడే ఉంటే... ప్రాణభయంతో ఒకసారి పారిపోయిన తర్వాత కూడా, మళ్ళీ స్వయంగా చావును వెతుక్కుంటూ మీ ముందుకు వస్తుందా? దానికి అసలు మెదడే లేదు కాబట్టే ఇలా వచ్చి మనకు ఆహారమైంది!" అని సమాధానమిచ్చింది.

పులి ఆ మాట నిజమేనని నమ్మి, తోడేలుతో కలిసి ఆ మాంసాన్ని తిని ఆకలి తీర్చుకుంది. ఎదుటివారు చెప్పే మాయమాటలను, మోసపూరితమైన ఆశలను గుడ్డిగా నమ్మకూడదు. ఒకసారి ఆపద నుండి బయటపడిన తర్వాత కూడా సమయస్ఫూర్తి, ఆలోచన లేకుండా పదే పదే తప్పు చేస్తే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES