SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pesara Kattu Recipe: పెసర కట్టు ఇలా చేసుకోండి.. రుచితో పాటు కడుపుకు హాయినిచ్చే సంప్రదాయ వంటకం

Pesara Kattu Recipe: పెసరపప్పుతో చేసే పెసర కట్టు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా తయారు చేయడం కూడా చాలా సులభం. ఆంధ్ర స్టైల్‌లో అల్లం, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్రతో తాలింపు పెట్టి చేసుకునే ఈ సంప్రదాయ వంటకాన్ని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అదిరిపోతుంది.

Written By Vishnu Priya
Published: Sep 29, 2026, 11:08 AM IST | Updated: Sep 29, 2026, 11:15 AM IST
Join

Pesara Kattu Recipe: మన తెలుగు ఇళ్లలో తరతరాలుగా చేసుకుంటున్న సంప్రదాయ వంటల్లో పెసర కట్టు కూడా ఒకటి. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో శరీరానికి చలువగా ఉండే ఆహారం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సమయంలో పెసర కట్టు మంచి ఎంపికగా ఉంటుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులభం.

పెసర కట్టు, పెసరపప్పు చారు ఒకటే అని చాలామంది అనుకుంటారు. కానీ రెండింటి తయారీ విధానంలో తేడా ఉంటుంది. సాధారణంగా పెసరపప్పు చారులో చింతపండు లేదా ఇతర రసం పదార్థాలు ఉపయోగిస్తారు. పెసర కట్టులో మాత్రం చింతపండు వేయరు. పెసరపప్పును మెత్తగా ఉడికించి, అందులో తాలింపు కలిపి తయారు చేస్తారు.

కావాల్సిన పదార్థాలు

పెసర కట్టు తయారు చేసుకోవడానికి ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అలాగే ఒక ఇంచు అల్లం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు అవసరం. తాలింపు కోసం ఒకటి లేదా రెండు చెంచాల నూనె, వెల్లుల్లి రెబ్బలు, అర చెంచా జీలకర్ర, అర చెంచా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. పులుపు ఇష్టపడేవారు చివర్లో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును నీటితో బాగా కడిగి కుక్కర్‌లో వేయాలి. అందులో ఒక పెద్ద గ్లాసు నీరు, తరిగిన అల్లం, పసుపు వేసి ఉడికించాలి. కుక్కర్‌లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే పప్పు బాగా మెత్తగా అవుతుంది.

ఆవిరి పూర్తిగా వెళ్లిన తర్వాత కుక్కర్ తెరిచి పప్పును గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మరో గ్లాసు నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి. మీడియం మంటపై సుమారు ఐదు నిమిషాలు మరిగించాలి. ఇది మరీ చిక్కగా లేదా నీళ్లలా పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి.

తర్వాత చిన్న పాన్‌లో నూనె వేడి చేసి వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఈ తాలింపును పెసర కట్టులో వేసి మరో నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.

కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మరసం కలుపుకోవచ్చు. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పెసర కట్టుతో తింటే రుచి అదిరిపోతుంది. వడియాలు లేదా చల్లమిరపకాయలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.

Read More: పరగడుపున నానబెట్టిన అంజీర్ తింటున్నారా? మీ శరీరంలో జరిగే ఊహించని మార్పులు ఇవే!

Read More: మొలకెత్తిన మెంతులు.. ఆరోగ్యానికి అమృతంతో సమానం.. ఇవి తెలిస్తే ఒక్క గింజ కూడా వదలరు!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES