SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విపరీతమైన ఒత్తిడిలో తెలంగాణ యూత్ ..జాతీయ స్థాయిలో రెండో స్థానంలో మన రాష్ట్రం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

Telangana youth stress: తెలంగాణ యువతకు ఏమైంది? తీవ్ర మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో ఎందుకు సతమతమవుతోంది? విపరీతమైన మానసిక ఒత్తిడిలో తెలంగాణ యువత.. జాతీయ స్థాయిలోనే రెండో స్థానంలో నిలిచింది మన రాష్ట్రం. ప్రముఖ హెల్త్ ప్లాట్ ఫామ్ ట్రయా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 04, 2026, 08:32 AM IST | Updated: Oct 04, 2026, 08:35 AM IST
Image Credit: Telangana youth stress
Join

Telangana youth stress: తెలంగాణలో భావి భారత్‌కు వెన్నెముకగా నిలవాల్సిన యువత తీవ్ర మానసిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలితో సతమతమవుతోంది. ముఖ్యంగా పురుషులలో చిన్న వయసులోనే జుట్టు విపరీతంగా రాలిపోవడానికి దారితీస్తున్న ఈ జీవనశైలి సంక్షోభంలో.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ప్రముఖ హెల్త్ ప్లాట్‌ఫామ్  ట్రయా  దేశవ్యాప్తంగా దాదాపు 5.6 లక్షల మంది పురుషులపై నిర్వహించిన ఒక సమగ్ర సర్వేలో ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి.

సర్వేలో అసలేం తేలిదంటే? 
దేశవ్యాప్తంగా 29 నుంచి 31ఏళ్ల వయస్సున్న పురుషులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో తేలింది. జాతీయ స్థాయిలో ఒత్తిడి సగటు రేటు 54.6శాతం ఉంటే.. తెలంగాణ ఇది ఏకంగా 63.6శాతంగా నమోదు అయ్యింది. దీంతో దేశంలో అత్యధిక ఒత్తిడి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. కేవలం ఒత్తిడి మాత్రమే కాదు.. నిద్రలేమి సమస్యల్లోనూ మన యువత ముందే ఉంది. జాతీయ సగటు 29.5శాతం అయితే.. తెలంగాణలో 36.7శాతం మంది యువకులు నిద్రలేమితో బాధపడుతూ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు. ఇక జీవక్రియ మందగించడం వంటి విషయంలో 50.7శాతంతో 3వ స్థానంలో నిలిచింది. ఈ మూడు సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి యువత ఆరోగ్యాన్ని ముఖ్యంగా వారి జుట్టును ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి.

ఒత్తిడి, పోషకాహార లోపం వంటి అంతర్గత సమస్యలే జుట్టుపై మొదటగా తమ ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం, జుట్టు రాలడాన్ని నియంత్రించుకోవడానికి నిపుణుల సలహా తీసుకునే సమయానికి, 55.2 శాతం మంది యువత సమస్య తీవ్ర దశకు చేరుకుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీవక్రియ లోపం అనే ఈ మూడు సమస్యలు ఒకే వ్యక్తిలో ఏకకాలంలో సంభవించి, శరీరాన్ని నిరంతరం ఒత్తిడికి గురిచేసే అంతర్గత వాతావరణాన్ని సృష్టిస్తాయని సర్వే పేర్కొంది.

నిరంతరం ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి.. జుట్టు పెరుగుదల చక్రాన్ని అడ్డుకుంటుంది. కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలిపోయేలా చేస్తుంది. నిద్రలోనే శరీరంలో కణాలు తమను తాము రిపేర్ చేసుకుంటాయి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలిగి జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరం సరైన సామర్థ్యంతో పనిచేయనప్పుడు.. అది తన శక్తిని పోషకాలను గుండె, కిడ్నీల వంటి ముఖ్యమైన ఆర్గాన్స్ కు పంపిస్తుంది. ఈ క్రమంలో జుట్టు పెరుగుదలకు ప్రాధాన్యం తగ్గుతుంది.

ఈ సందర్భంగా ట్రయా హెల్త్ సహా వ్యవస్థాపకురాలు సలోని ఆనంద్ మాట్లాడారు. పురుషులు ఊహించినదానికంటే చిన్న వయస్సులోనే జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జుట్టు రాలడానికి కేవలం తలపై చర్మ సమస్యలే కారణం కాదు.. శరీరంలో అంతర్గతంగా జరుగుతున్న ఈ పరిణామాలే అసలు మూలమని వివరించారు.

ఈ సర్వే ప్రకారం.. ఒత్తిడి, నిద్రలేమి, జీవక్రియలోపం.. ఈ మూడు సమస్యల్లోనూ తమిళనాడు రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సమస్య దక్షిణాది యువతను ఎంతగా పట్టిపీడిస్తోందో అర్థమవుతోంది. జుట్టురాలడం అనేది కేవలం సౌందర్య సమస్యగా కాకుండా..తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి సంకేతంగా చూడాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES