Chandrababu: అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు
AP CM Chandrababu Big Alert And Review On Arnab Cyclone: అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో పరిస్థితులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Arnab Cyclone: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండడంతోపాటు అర్నాబ్ తుఫాను ఏర్పడడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంపై ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ప్రాంతాల్లో తరలింపు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్యం, విద్యుత్ పునరుద్ధరణ అంశాల్లో సన్నద్దతపై సమీక్ష చేశారు.
అర్నాబ్ తుఫానుపై ఆదివారం సమీక్ష నిర్వహించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీ అధికారులు, వ్యవసాయ, విద్యుత్, ఇరిగేషన్, హోం శాఖ అధికారులు, విద్యారోగ్య, పౌర సరఫరాలు, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు హాజరయ్యారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం, రాష్ట్రంపై ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
'సహాయక చర్యల కోసం రాష్ట్రంలో అందుబాటులోకి 10 ఎన్‌డీఆర్‌ఎఫ్, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఉండాలి. ప్రమాద ప్రాంతాల్లో తరలింపు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్యం, విద్యుత్ పునరుద్ధరణ అంశాల్లో సన్నద్దతగా ఉండాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, మందస్తు ప్రణాళికతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలని చెప్పారు.
భారీ వర్షాల కారణంగా వచ్చే వరదతో రిజర్వాయర్లు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ 28వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నంలోగా బాపట్ల–విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని.. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ- యానాం- కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
'విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం. అక్టోబర్ 26 ఉదయానికి తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, 27న అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు...కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 27 ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది' అని సమావేశంలో సీఎం చంద్రబాబుకు అధికారులు వెల్లడించారు.
'అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై గాలులు, వర్షాల ప్రభావం ఉండే అవకాశం. అక్టోబర్ 27, 28 తేదీల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ. నమోదయ్యే అవకాశం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ., విశాఖపట్నంలో 253.87 మి.మీ., శ్రీకాకుళంలో 249.18 మి.మీ. వర్షపాతం అంచనా. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మి.మీ.గా అంచనాప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ వర్షపాతం అవకాశం. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుంది.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు' అని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.