Chandrababu: అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోయింది. తీవ్రమైన గాలులు.. భారీ వర్షాలు పడడంతో ఏపీకి తీరని నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారమే భారీ నష్టం.. పూర్తిస్థాయి అంచనాలతో మరింత పెరిగే అవకాశం ఉంది. అర్నాబ్ తుఫాన్ ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనాలు వేసింది. తుఫాన్ ద్వారా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.
అర్నబ్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.4,600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పూర్తిస్థాయి నష్టాల అంచనా అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలనకు శుక్రవారం కేంద్ర బృందాలు ఏపీకి రానున్నాయని.. వీలైనంత సహాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గచ్చకాయలపొర గ్రామంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను గురువారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. అర్నబ్ తుఫాను కారణంగా సంభవించిన నష్టం, ప్రభుత్వ ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు, బాధితులకు అందించనున్న పరిహారం తదితర అంశాలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా నష్టంపై అంచనాలు వేశారు.
అర్నబ్ తుఫానుతో ఏపీ రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు.. తుఫాను ప్రభావం, ప్రాణ, ఆస్తి నష్టం, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర బృందాలను పంపిస్తామని కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల మేర నష్టం జరిగినట్లు గుర్తించామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసిన తర్వాత ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులకు పరిహారం
అర్నాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని.. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ.1,500, ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాన్ని సంబంధిత శాఖల అధికారులతో అంచనా వేయించి, అర్హులైన రైతులకు పరిహారం మొత్తాన్ని త్వరితగతిన జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగానే పంటల బీమా సౌకర్యం కల్పించడంతో పరిహారం పొందే అవకాశం ఉందని.. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
బాధితులకు సహాయం
అర్నాబ్ తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రాలకు తరలించిన బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకుల ప్యాకెట్‌తో పాటు ఖర్చుల నిమిత్తం నగదు సాయం అందించనున్నట్లు ప్రకటించారు. అర్నబ్ తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించినట్లు వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం
అర్నబ్ తుఫాను కారణంగా కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని.. రోడ్లపై కూలిన చెట్లను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దింపామని వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.