AP High Court On Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల కేటాయింపు అంశాలపై దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ తర్వాత తీర్పు వెల్లడించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 105, 1065లను హైకోర్టు కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలకు భిన్నంగా ఈ ప్రభుత్వ జీవోలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చెల్లకుండా పోవడంతో, ఇకపై రాజకీయ పార్టీలు తమ స్థాయిలో బీసీ అభ్యర్థులకు ప్రాతినిధ్యం దక్కేలా పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది
వైసీపీ పిటిషన్ల తోసిపుచ్చిన కోర్టు..
ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ముగియకుండా ఎన్నికలు నిర్వహించవద్దని, బీసీ జనగణనతో పాటు వార్డుల పునర్విభజన అనంతరమే ఎన్నికలు జరపాలంటూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎదురైన చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి ఆరు వారాల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికల సన్నాహాలు, పోలింగ్ షెడ్యూల్..
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. తుది జాబితా ప్రచురణ ముగిసిన వెనువెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
దసరా పండుగ తదుపరి ఈ నెలాఖరులోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచనతో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇదివరకే ఎన్నికల సంఘం వెల్లడించిన నేపథ్యంలో, హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక పోరు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.