AP Inter Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది! ఫిబ్రవరిలోనే మొదటి ఎగ్జామ్..తేదీల వివరాలు ఇవే!
AP Inter Exams Schedule 2027: ఆంధ్రప్రదేశ్‌లో 2027 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు జరగనుండగా, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచే ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం ప్రతీరోజూ నిర్దిష్ట సమయాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
AP Inter Exams Schedule 2027: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ (జూనియర్), ద్వితీయ (సీనియర్) సంవత్సర విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ తేదీల వివరాలను అధికారికంగా తెలిపింది.
ఇంటర్ థియరీ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమై మార్చి 16వ తేదీ వరకు కొనసాగుతాయి. అందులో జూనియర్ ఇంటర్ (ఫస్టియర్).. అనగా ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 24న మొదటి పరీక్ష ప్రారంభమవుతుంది. అలాగే సీనియర్ ఇంటర్ (సెకండియర్) అనగా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మరుసటి రోజు, అనగా ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు మొదలవుతాయి.
అయితే ఇంటర్ మొదటి, ద్వితీయ ఏడాది పరీక్షల పరీక్షా సమయాలు మాత్రం కామన్‌గా ఉంటాయి. థియరీ పరీక్షలు ప్రతీరోజూ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించనున్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విషయానికొస్తే.. థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేసేలా బోర్డు నిర్ణయం తీసుకుంది.
జనరల్ కోర్సులు: జనరల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఒకేషనల్ కోర్సులు: ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
సెషన్ల వివరాలు..
ప్రాక్టికల్స్ ఆదివారాలతో సహా ప్రతీరోజూ రెండు సెషన్లలో జరుగనున్నాయి. ఉదయం సెషన్ 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని బోర్డు పేర్కొంది.
తాత్కాలిక షెడ్యూల్ పై మార్గదర్శకాలు..
ప్రస్తుతం బోర్డు విడుదల చేసిన ఈ షెడ్యూల్ తాత్కాలికమైనది మాత్రమే. ప్రభుత్వ సెలవులు, వివిధ పండుగల తేదీలను పరిగణనలోకి తీసుకుని, అవసరమైతే తుది షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రామాణికంగా ఉంచుకుని, పరీక్షల సన్నాహక ప్రణాళికను రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.