AP Weather Update: భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం.. బంగాళాఖాతంలో అక్టోబర్ 23 నాటికి మరో నూతన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంత ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా వరకు సముద్ర మట్టానికి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఇది శుక్రవారం ఉదయానికి ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతానికి చేరుకుని, ఆ తర్వాత పశ్చిమ - వాయవ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ, తూర్పు - మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి అక్టోబర్ 28 నాటికి తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై తుఫాన్ ప్రభావం..
ఈ తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో తీవ్రమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఆదివారం నుంచి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
తమిళనాడులో అస్తవ్యస్తమైన జనజీవనం..
ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల రహదారులు జలమయమై వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 26 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
కన్యాకుమారి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రైలు ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం తీవ్రత వల్ల కేరళం - కన్యాకుమారి మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోని జలపాతాలను అధికారులు మూసివేశారు.