SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Municipal Election Result: ఏపీ పుర పోరులో కూటమిదే ఆధిపత్యం..స్థానిక సంస్థల్లో చారిత్రాత్మక విజయం..ఎవరెన్ని స్థానాల్లో గెలిచారు?

AP Municipal Election Result 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) అపూర్వ విజయాన్ని సాధించింది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలకు జరిగిన ఈ పోరులో కూటమి పార్టీలు దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాయి.

Written By Harish Darla
Published: Nov 04, 2026, 06:04 AM IST | Updated: Nov 04, 2026, 06:15 AM IST
Join

AP Municipal Election Result 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబరు 1వ తేదీన 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు పోలింగ్ జరిగింది. మొత్తం 96,89,061 మంది ఓటర్లలో 60,22,411 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 62.16 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ప్రారంభం నుంచే ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కూటమి ప్రభంజనం
రాష్ట్రంలోని జరిగిన 13 మున్సిపల్ కార్పోరేషన్లలో దాదాపుగా 12 కూటమి పార్టీలకు సొంతం కాగా.. అనంతపురం కార్పోరేషన్‌లో మాత్రం వైసీపీ గెలుపొందింది. అయితే అనంతపురంలో కూటమి పంపకాల్లో భాగంగా బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించగా.. పరాజయాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రం మొత్తం మీద జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీకి దక్కిన ఒకే ఒక్క స్థానం ఇదే కావడం గమనార్హం.

అలాగే 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో సుమారు 90 శాతం స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. వీటిలో టీడీపీ 59, జనసేన 18, బీజేపీకి 4, వైసీపీ 3, ఇతరలు 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో ఇప్పటికే 17 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పదవులు, 8 చోట్ల వార్డు సభ్యులతో సహా ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.

మున్సిపల్ కార్పోరేషన్లలో పార్టీల వారీగా..
ప్రధాన కార్పొరేషన్ల మేయర్లుగా విజయం సాధించిన అభ్యర్థులు..
గ్రేటర్ విశాఖపట్నం (GVMC): ముక్కా శ్రావణి (టీడీపీ)
విజయనగరం: అవనాపు భార్గవి (టీడీపీ)
ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు (జనసేన)
మచిలీపట్నం: షేక్ అబ్దుల్లా అబిదా (టీడీపీ)
విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ (జనసేన)
గుంటూరు: కే. లక్ష్మీ అపర్ణ (టీడీపీ)
ఒంగోలు: నల్లిమిల్లి శ్రీ శిల్ప (టీడీపీ)
కర్నూలు: విజయ ప్రత్యూష (టీడీపీ)
నెల్లూరు: ఆనం రూప్ కుమార్ యాదవ్ (టీడీపీ)
కడప: మట్లి సువర్ణ (టీడీపీ)
అనంతపురం:  రమేష్ గౌడ్ (వైఎస్సార్‌సీపీ)
తిరుపతి: ఎం. శ్రీనివాస్ ప్రసాద్ (టీడీపీ)
చిత్తూరు: కే. హేమలత (టీడీపీ)

సంచలన ఫలితాలు: పులివెందుల, కుప్పం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీ విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ మొత్తం 32 వార్డులను గెలుచుకుని సంపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీ కేవలం నందికొట్కూరు మున్సిపాలిటీలోనే విజయం సాధించింది.

రాజకీయ నేతల స్పందన
ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా అభివర్ణించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..'ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రజలు కూటమికే సంపూర్ణ మద్దతు తెలిపారు' అని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ తీర్పు సంబరాలకు కాదు, సేవ చేయడానికి ప్రజలిచ్చిన బాధ్యత అని, అహంకారానికి తావులేకుండా ప్రతి పౌరుడికి సేవ చేస్తామని చెప్పారు.

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నిక కాదని, అధికార బలంతో చేసిన ఎంపిక అని ఆరోపిస్తూ పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES