Panchayat Elections: ఏపీలో మామ అల్లుళ్ల 'పంచాయితీ'.. బాలకృష్ణ వర్సెస్ నారా లోకేశ్!
Balakrishna PA And Nara Lokesh PA Fight For Sarpanch Post: మామా అల్లుళ్లు బాలకృష్ణ, నారా లోకేశ్ బద్ద శత్రువులుగా మారారు. తమ వ్యక్తిగత సహాయకుల కోసం టీడీపీ పార్టీ రెండుగా చీలింది. ఓ సర్పంచ్ పదవి కోసం బాలకృష్ణ, నారా లోకేశ్ పీఏలు ఆధిపత్య పోరుకు దిగారు. పీఏల పంచాయితీతో బాలకృష్ణ, లోకేశ్ తలలు పట్టుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Balakrishna PA vs Nara Lokesh PA: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రోత్సాహక నగదు బహుమతి పెంచడంతో పెద్ద ఎత్తున గ్రామాల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవమవుతోంది. అయితే ఏకగ్రీవం కానీ పంచాయతీల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్ పదవి కోసం గ్రామ ప్రజలు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే ఒక పంచాయతీ పదవి కోసం మామ అల్లుళ్లుగా ఉన్న నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ మధ్య వివాదానికి దారి తీసింది. ఎందుకంటే సర్పంచ్ పదవి కోసం వారిద్దరి పీఏలు పోటీపడుతున్నారు. తమ వర్గానికే సర్పంచ్ పదవి దక్కాలని బాలకృష్ణ పీఏ, లోకేశ్ పీఏ తమ వర్గాలను బరిలో దించారు. పీఏల మధ్య తగాదా మామ అల్లుళ్ల మధ్య విభేదాలు ఏర్పడే పరిస్థితికి దారి తీసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నారా లోకేశ్ పీఏ సాంబశివరావు, బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వీరిద్దరూ ఒక సర్పంచ్ పదవి కోసం యుద్ధానికే దిగారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వీరిద్దరూ బాలకృష్ణ, లోకేశ్‌కు పీఏలుగా పనిచేస్తున్నారు. తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో వీరిద్దరూ రెండు వర్గాలుగా విడిపోయారు. తమ వర్గానికి పదవి దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేశ్ పీఏ సాంబశివరావు వర్గం నుంచి నాగండ్ల రాంబాబు సర్పంచ్ పదవి కోసం పోటీలో నిలబడగా.. బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు తన సమీప బంధువు పావులూరి పిచ్చయ్య బరిలో నిలబడ్డారు.
లోకేశ్ పీఏ వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా మద్దతు తెలుపుతుండడంతో తిమ్మాపురం పంచాయతీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. దీంతో తమ వర్గానికే పదవి లభించాలనే లక్ష్యంతో బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు ఆదివారం తన సమీప బంధువు పావులూరి పిచ్చయ్యతో భారీ ర్యాలీతో నామినేషన్ వేయించారు. అయితే ఆ ర్యాలీని అదనపు ఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఈ పంచాయతీ ఎన్నిక మరింత రాజుకుంది. బాలకృష్ణ పావులూరి శ్రీనివాసరావుతోపాటు మరో 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీసుస్టేషన్‌కు తరలించడంతో కలకలం రేపింది.
శ్రీనివాస రావుతోపాటు పెద్ద ఎత్తున నాయకులను అరెస్ట్ చేయడంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వందల సంఖ్యలో నాదెంట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పావులూరి శ్రీనివాసరావుతో పాటు మిగిలిన వారిని విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. ఏఎస్పీ హనుమంతరావు హెచ్చరించినా గ్రామస్తులు కదలలేదు. ఒక వర్గానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని బాలకృష్ణ పీఏ వర్గం ఆరోపించింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఏఎస్పీ, సీఐలు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.
బాలయ్య పీఏ శ్రీనివాసరావుతోపాటు 66 మందిపై తీవ్రమైన కేసులు నమోదు చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బాలకృష్ణ పీఏతోపాటు అందరిని రిమాండ్‌కు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఏల పంచాయితీ ఎంతటి పరిస్థితికి దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ ఏం జరుగుతుందనేది తిమ్మాపూర్ పంచాయతీలో ఉత్కంఠ ఏర్పడింది.