Uttar Pradesh Viral News: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా బరౌత్ ప్రాంతంలోని జోహ్రీ గ్రామానికి చెందిన బల్జోర్ సింగ్ ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తాను బతికి ఉండగానే.. తన తద్దిన కార్యక్రమాన్ని తానే నిర్వహించుకున్నాడు. సాధారణంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు నిర్వహించే ఈ వేడుకలో.. ఆయనే స్వయంగా అతిథులను ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరిచాడు. తనకు ఒక్కగానొక్క కూతురు పింకీ మాత్రమే ఉందని.. ఆమెకు అన్నదమ్ములు ఎవరూ లేరని బల్జోర్ సింగ్ తెలిపాడు. తన మరణం తర్వాత తద్దిన కార్యక్రమం నిర్వహించడం.. బంధువులను పిలవడం వంటి బాధ్యతలు కూతురిపై పడకూడదని భావించినట్లు చెప్పాడు. అందుకే తాను బతికి ఉండగానే.. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ వేడుకను కుటుంబ సభ్యులనే కాకుండా.. గ్రామ ప్రజలను మొత్తం పిలిచాడు. బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కలిపి దాదాపు 900 మంది హాజరయ్యారు. అతిథుల కోసం 8 వంటవాళ్లను ఏర్పాటు చేశారు. పూరీలు, కూరలు, స్వీట్లతో విందు సిద్ధం చేశారు. సంప్రదాయం ప్రకారం హవనం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. కుటుంబ పెద్ద మరణించినప్పుడు నిర్వహించే పగ్డీ వేడుకను కూడా బల్జోర్ సింగ్ జరిపించాడు. తన మనవడు ముకుల్ తలపై స్వయంగా పగ్డీ కట్టి కుటుంబ బాధ్యతలను అతడికి అప్పగిస్తున్నట్లు సంకేతంగా తెలియజేశాడు. తనకున్న వ్యవసాయ భూమిని కూడా మనవడికి ఇప్పటికే ఇచ్చినట్లు ఆయన తెలిపాడు.
తండ్రి తీసుకున్న నిర్ణయంపై కూతురు పింకీ కూడా సానుకూలంగా స్పందించారు. తన తండ్రి కోరిక మేరకే ఈ కార్యక్రమం నిర్వహించామని.. ఆయన ఆరోగ్యంగా ఉండి కుటుంబానికి పెద్దగా మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సాధారణంగా మరణం తర్వాత జరిగే కార్యక్రమాన్ని ఒక వ్యక్తి తన బతికి ఉన్న సమయంలో జరిపించుకోవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తర్వాత కుటుంబ సభ్యులు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి ముందుగానే ఆలోచించిన ఓ తండ్రి నిర్ణయంగా ఈ ఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.