SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bhimavaram Municipality: కూటమిలో 'కేంద్రమంత్రి' కలకలం.. భీమవరం మున్సిపాలిటీలో త్రిముఖ పోరు తప్పదా?

Political Heat In Bhimavaram After Union Minister Bhupathi Raju Srinivasa Varma Statements: మున్సిపల్‌ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపగా.. ప్రస్తుతం భీమవరంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవంగా కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇక్కడ త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 16, 2026, 16:10 IST | Updated: Nov 16, 2026, 16:17 IST
Image Credit: Bhupathi Raju Srinivasa Varma
Join

Bhupathi Raju Srinivasa Varma: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు భీమవరం మున్సిపల్ పోరు హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. కూటమి భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ ఇక్కడ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భీమవరంలో 'ఫ్రెండ్లీ పోటీ'కి దిగుతామని ప్రకటించింది. దీంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు భీమవరంలో ఏం జరుగుతోంది? కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్గతంగా ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

భీమవరం మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయంపు వ్యవహారం కూటమిలో తీవ్ర కలకలం రేపింది. బీజేపీకి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి తగిన గౌరవం ఇవ్వకపోతే సహించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీని సంప్రదించకుండా ఏకపక్ష ప్రకటనలు చేశారని.. మొత్తం 52 వార్డుల్లో బీజేపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి ఇల్లు ఉన్న ప్రాంతాలకే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తం 52 వార్డులు ఉన్న భీమవరం మున్సిపాలిటీలో బీజేపీకి కేటాయించిన సీట్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదు వార్డులు మాత్రమే ఇస్తామని చెప్పడమే కాకుండా.. ఆ ఐదు వార్డులు ఏమిటో కూడా కూటమి పెద్దలే నిర్ణయించడం సమంజసం కాదని తప్పుపట్టారు. 'నా ఇంటి పక్కన ఉన్న ఐదు వార్డులే బీజేపీకి కేటాయిస్తే ఎలా పార్టీ క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాలను విస్మరించి.. ఇలా ఏకపక్షంగా సీట్లు కేటాయించడం మా కార్యకర్తలను అవమానించడమే' అని కేంద్రమంత్రి శ్రీనివాస్‌ వర్మ పేర్కొన్నారు.

ఈ సీట్ల కేటాయింపులో పార్టీలోని సీనియర్ నాయకులను కూడా విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ కుమారుడికి కూడా ఎన్నికల్లో అవకాశం కల్పించకపోవడంపై కమలదళం తీవ్ర అసంతృప్తితో ఉంది. 1981 నుంచి భీమవరం మున్సిపాలిటీలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీజేపీకి సముచిత ప్రాతినిధ్యం ఉందని, అలాంటి పార్టీని ఇప్పుడు మూలకు నెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని కాషాయ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇక వెనక్కి తగ్గేది లేదని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి సొంతంగా పోటీ చేసే బలం, బలగం స్పష్టంగా ఉన్నాయని తేల్చిచెప్పారు. అవసరమైతే భీమవరంలోని అన్ని స్థానాల్లోనూ లేదా పొత్తులో కేటాయించిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో స్వయంగా బరిలోకి దిగి బీజేపీ సత్తా చాటుతామని ప్రకటన చేయడం కలకలం రేపింది. బీజేపీ ఆత్మగౌరవం, క్షేత్రస్థాయి కార్యకర్తల గౌరవం విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో కూటమిలో ఇది పెద్ద కుదుపుగా మారింది.

రాష్ట్ర స్థాయిలో కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సర్దుబాట్లు, సీట్ల కేటాయింపులు ఇలా పెద్ద మంటను రాజేస్తున్నాయి. కేంద్ర మంత్రే స్వయంగా రంగంలోకి దిగి 'ఫ్రెండ్లీ పోటీ' లేదా 'సొంత బలం' అంటుండటంతో.. రానున్న భీమవరం మున్సిపల్ ఎన్నికలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి ఇది ఒక పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంది. దీనిపై టీడీపీ, జనసేన అగ్రనేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ వివాదానికి తెర పడుతుందా? లేదా భీమవరంలో త్రిముఖ పోరు తప్పదా? వేచి చూడాల్సిందే!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES