Jammalamadugu MLA Adinarayana Reddy: మూడేళ్ల కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో జనసేన, బీజేపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. తీవ్రస్థాయిలో విబేధాలు కొనసాగుతున్నా పైకి నవ్వుతూ కనిపిస్తున్న కూటమిలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల వేళ లుకలుకలు బయటపడ్డాయి. టీడీపీ తీరుపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. రేపు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
జెడ్పీటీసీలు కూడా రాజీనామా?
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయనతోపాటు జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్లకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు తమ పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మలమడుగులో జరుగుతున్న పరిణామాలతో కూటమిలో కుమ్ములాట కొనసాగుతోందని స్పష్టమవుతోంది.
ఇంతకీ ఏం జరిగింది?
కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎన్నిక తాజా పరిణామాలకు దారి తీసింది. జెడ్పీ చైర్మన్ కేటాయింపు వ్యవహారం బీజేపీలో చిచ్చు రేపింది. తమ కుటుంబానికి చెందిన చదిపిరాళ్ల రాజేష్‌రెడ్డికి జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా చివరకు టీడీపీకే కేటాయించడంతో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే భావిస్తున్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడంతో ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురయిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
బుజ్జగింపు ప్రయత్నాలు
జెడ్పీ చైర్మన్ ఎన్నిక పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనయిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో బీజేపీ పెద్దలు సంప్రదింపులు చేశారని తెలుస్తోంది. విజయవాడలో బస చేసిన ఆదినారాయణ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారని.. అతడిని బుజ్జగించే ప్రయత్నం చేశారని సమాచారం. అంతకుముందు బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.కడప జెడ్పీ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించకపోవడంపై ఆదినారాయణ రెడ్డి వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తదుపరి నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.