Saluru Municipal Election: రాజకీయంగా ఎదుగుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వం సిద్ధమవగా రిజర్వేషన్ మారింది. దీంతో వెంటనే తాను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న యువతిని అతడు అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నాడు. రిజర్వేషన్ స్థానంలో తన భార్యతో పోటీ చేయిద్దామనుకుని అన్నీ ఏర్పాట్లు చేసుకోగా.. ఊహించని మరో షాక్ తగిలింది. తాను పోటీ చేయాలనుకున్న స్థానం మిత్రపక్షానికి వెళ్లిపోయింది. దీంతో ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ నాయకుడి ఆశలకు గండి పడింది. ఆ కొత్త దంపతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఏపీలోని పార్వతీపురం జిల్లా సాలూరు మున్సిపల్ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు హర్షవర్ధన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈసారి మున్సిపల్ పీఠాన్ని అధిరోహించాలనే కొన్నాళ్లుగా పక్కా ప్రణాళికతో రాజకీయం చేస్తున్నాడు. ఈ క్రమంలో చైర్పర్సన్ టికెట్ బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. మహిళకు కావడంతో తాను చైర్మన్ పదవి చేపట్టే అవకాశం కోల్పోయిన నేపథ్యంలో వెంటనే మరో ఆలోచన చేశాడు. ఇంకా అవిహితుడు కావడంతో వివాహం చేసుకుంటే తన భార్య పోటీ చేయవచ్చనే ఆశతో తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.
తాను పెళ్లి చేసుకుంటే భార్య మున్సిపల్ చైర్పర్సన్ పదవిని పొందవచ్చనే ఆశతో ఎవరికీ చెప్పాపెట్టకుండా ఓ ఆలయంలో హర్షవర్ధన్ తాను ప్రేమించిన మంజీరను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగి మూడు రోజులు కాలేదు మరో షాకింగ్ న్యూస్ అతడికి తెలిసింది. రాష్ట్రంలో మహా కూటమి అధికారంలో ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఊహించని రీతిలో సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనసేన పార్టీకి వెళ్లింది. దీంతో హర్షవర్ధన్ ఆశలు పూర్తిగా ఆవిరి అయిపోయాయి.
అటు రిజర్వేషన్ రాకపోవడం.. దీనికితోడు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు వెళ్లిపోవడంతో టీడీపీ నాయకుడు హర్షవర్ధన్ ఏం చేయాలో తెలియక మదనపడుతున్నాడు. వాస్తవానికి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న తన ప్రియురాలిని మరో ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం ముహూర్తాలు కూడా చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే హర్షవర్ధన్‌కు చివరికి నిరాశే మిగిలింది
మరో అవకాశం?
పదవి కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నాయకుడు హర్షవర్ధన్‌కు మూడు దారులు ఉన్నాయి. పొత్తులో భాగంగా సాలూరు చైర్పర్సన్ పదవి జనసేన పార్టీకి కేటాయించడంతో దానిని తిరిగి టీడీపీకి దక్కేలా ఉన్నతస్థాయిలో హర్షవర్ధన్ ప్రయత్నాలు చేయాల్సి ఉంది. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన కోసం సాలూరులో టీడీపీ పోటీ చేసేలా అంగీకరింపజేయాల్సి ఉంది. లేదంటే టీడీపీని వీడి జనసేన పార్టీలో హర్షవర్ధన్ చేరి మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం తన భార్యను బరిలోకి దింపాల్సి ఉంది. ఇక ఒకే ఒక అవకాశం జనసేన పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిందే. అంటే హర్షవర్ధన్ తన భార్య మంజీరను టీడీపీ రెబల్‌గా పోటీ చేయాల్సి ఉంది. ఈ మూడు మార్గాల్లో ఏదో ఒకటి చేస్తే హర్షవర్ధన్ కల తీరుతుంది. లేదంటే ఈసారికి అతడు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి.