Andhra Pradesh Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఒకే దశలో పురపాలక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని పరిశీలన చేసింది. ఇక పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర కీలక వివరాలు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.
ఎన్నికల ప్రకటన వెలువడిన 14 రోజుల్లోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. 15 రోజుల్లో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు, రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయని వివరించారు. అనంతరం 16 రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండు రోజుల తర్వాత ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా.. మిగిలినవన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు.. తెలంగాణ నుంచి 17,650 బాక్సులు తెప్పించినట్లు సీఈసీ అనిల్ చంద్ర తెలిపారు. 'అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి సిద్ధం చేశాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాలన్న సూచనలు పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తాం' అని సీఈసీ అనిల్ చంద్ర వివరించారు.