Cyclone Akvan School Holidays: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అక్వాన్' తుఫాను దృష్ట్యా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తగా ప్రభావం ఉన్న 6 జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. ఈ తుఫాను నవంబర్ 21 మధ్యాహ్నానికి నరసాపురం - ఒడిశాలోని పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఐఎండీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 8:30 గంటల సమయానికి అక్వాన్ తుపాను బంగాళాఖాతంలోని దక్షిణ, పశ్చిమ మధ్య ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది నరసాపురానికి 500 కి.మీ, కళింగపట్నానికి 540 కి.మీ, చెన్నైకి 560 కి.మీ, పూరీకి 690 కి.మీ దూరంలో కొనసాగుతోంది. ఈ తుఫాను నవంబర్ 20 మధ్యాహ్నానికి నరసాపురం - పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రభుత్వాలు కీలక నిర్ణయం..
నవంబర్ 20 మధ్యాహ్నం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో అక్వాన్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ఒడిశా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, తుపాను ముప్పున్న ఆరు జిల్లాల్లో రేపటి నుంచి మూడు రోజుల పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శ్రీకాకుళంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవును ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలపై తుఫాను ప్రభావం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో నవంబర్ 19న అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా తెలంగాణలో అక్వాన్ తుఫాను ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని సమాచారం. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు రాత్రివేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశముంది.