Cyclone Arnab Impact: కోనసీమలో 'అర్నబ్' తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో వందలాది గ్రామాలు, తీవ్ర విద్యుత్ సంక్షోభం
Cyclone Arnab Impact AP: అర్నబ్ తుఫాన్ ధాటికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాన్ వచ్చి ఐదు రోజులైనా వందలాది గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వేలాది ఎకరాల్లో పంటలు నాశనం కావడం, వేల ఇళ్లు దెబ్బతినడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.
Cyclone Arnab Impact AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200కి పైగా గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 150కి పైగా గ్రామాలు ఐదు రోజులుగా కరెంట్ లేక చీకట్లోనే గడుపుతున్నాయి. ఒక్క కోనసీమ జిల్లాలోనే 8,000కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ లేకపోవడంతో ప్రజలు మొబైల్ ఫోన్లు, ఇన్వర్టర్లు ఛార్జింగ్ చేసుకోవడానికి జనరేటర్ల ఆధారంగా నడిచే తాత్కాలిక ఛార్జింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇన్వర్టర్ ఒక్కసారి ఛార్జ్ చేయడానికి రూ.500, మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌కు రూ.20 చొప్పున చెల్లించాల్సి రావడం బాధితులకు అదనపు భారం అవుతోంది.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు..
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖకు చెందిన 2,000 మంది, తెలంగాణ నుండి వచ్చిన 1,000 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. అమలాపురం, రాజోలు వంటి పట్టణ ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను పునరుద్ధరించగా, గ్రామీణ ప్రాంతాలకు ఇవాళ సాయంత్రానికల్లా పూర్తిస్థాయిలో విద్యుత్ అందిస్తామని అధికారులు వెల్లడించారు.
భారీగా వ్యవసాయ, ఆస్తి నష్టం..
తుఫాన్ దాటికి కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆస్తి, పంట నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. తుఫాను ధాటికి దెబ్బ తిన్న ఇళ్లకు దాదాపుగా 3,500 ఇళ్లు దెబ్బతినగా, 200కి పైగా ఇళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
తుఫాను ధాటికి 20,000 ఎకరాల్లో వరిపంట నేలకొరిగి, ఎకరానికి రూ.40,000 వరకు నష్టం వాటిల్లింది. అలాగే అరటి తోటల్లో నష్టానికి రూ.73,500 ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించగా.. తుఫాను ధాటికి గోదావరి జిల్లాల్లో 73,500 కొబ్బరి చెట్ల నేలకొరిగాయి. మరోవైపు సముద్ర తీరంలో ఉన్న మత్యకారులకు చెందిన 450 మత్య్సకార బోట్లు ధ్వంసమయ్యాయి.
కేంద్ర బృందం పర్యటన, ఆశతో రైతాంగం..
రాష్ట్రంలో తుఫాన్ వల్ల దాదాపు రూ. 4,600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో నలుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ, పరిహారం అందించి ఆదుకోవాలని నష్టపోయిన రైతులు, తుఫాన్ బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు.