SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YS Jagan: 'స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలపై కసితో గట్టిగా పోరాటం చేశారు': వైఎస్‌ జగన్‌

YS Jagan Appreciates To YSR Congress Party Cadre: వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో అంతా కసితో గట్టిగా పోరాటం చేశారని పార్టీ నాయకులపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఎన్నికల చంద్రబాబు అక్రమాలు చేశారని.. వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి ఫలితాలు తారుమారు చేశారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 11, 2026, 06:46 PM IST | Updated: Nov 11, 2026, 06:53 PM IST
Image Credit: Source: YSRCP Twitter
Join

YSR Congress Party: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ దగ్గర నుంచి.. ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినా ఓటింగ్‌ శాతం పెరిగింది. సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్‌ శాతం నమోదయ్యేది. ఇది బయటకు వస్తే తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే చంద్రబాబు అరాచకాలు చేశాడు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. 'ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారు. ఇవన్నీ దాటుకుని విజయాలు సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి ఫలితాలు తారుమారు చేశారు' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ ఆరోపించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలుసుకున్న పలు జిల్లాలకు చెందిన నాయకులు. స్థానిక ఎన్నికలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ మాట్లాడుతూ.. 'వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో అంతా కసితో గట్టిగా పోరాటం చేశారు. చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారు, వారికి కూడా బాగా అర్థమైంది. 2024 ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ఓటింగ్‌ శాతాలు పెరిగాయి' అని తెలిపారు.

'వైఎస్సార్‌సీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ నిందలు మోపి.. లేని అబద్ధాలు చెప్పి ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు, అక్రమాలను చంద్రబాబు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది' అని చంద్రబాబు తీరుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా రాజకీయ జీవితాల్లో ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదని.. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది' అని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌తో వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.

'ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులు బౌన్సర్లు పెట్టి నడిపారు. అభ్యర్థుల బంధువులను కిడ్నాప్‌ చేసి, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారు. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్లు పేరిట చాలా వరకు వైఎస్సార్‌సీపీ ఓట్లు తీసేశారు' అని జగన్‌తో వైఎస్సార్‌సీపీ నాయకులు చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లో కరెంటు ఆపి మరీ ఫలితాలు తారుమారు చేశారని.. వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌లు చేసి, లెక్కలు తారుమారు చేశారని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ అడిగిన చోట రీకౌంటింగ్‌లు మాత్రం చేయలేదని నాయకులు చెప్పుకొచ్చారు. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి, వారిని గెలిపించేలా అక్రమాలు చేశారని జగన్‌కు ఫిర్యాదు చేశారు.

జగన్‌తో అనంతపురం మేయర్‌ భేటీ
అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర మేయర్‌గా ఎన్నికైన రమేశ్‌ గౌడ్‌ తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్‌ రమేశ్‌‌ గౌడ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం 'అనంతపురం నగర ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి' అని మేయర్‌ రమేశ్‌‌ గౌడ్‌కు సూచించారు. ప్రజల పక్షాన నిలబడుతూ నగరాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని.. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

అధికార కూటమి శ్రేణులు ఎన్ని కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా వాటికి వెరవకుండా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన అనంతపురం నగర ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని మేయర్‌ రమేశ్‌ గౌడ్‌కు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని.. రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని దీవించారు. తనకు లభించిన అవకాశాన్ని బాధ్యతగా భావించి.. ప్రజల సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో మేయర్‌ రమేశ్‌ గౌడ్‌ తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES