Sonia Gandhi Movie: భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రధాన భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు, ఎంపీ సోనియాగాంధీ చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది. ఆమె రచించిన ఆత్మకథ 'బీ లాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకంపై చర్చ జరుగుతోంది. ఈ పుస్తకంలో భారతదేశంలోని కీలక పరిణామాలపై ఆమె పుస్తకంలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఈ పుస్తకంపై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. ఓ కాంగ్రెస్ నాయకుడు కీలక ప్రకటన చేశారు. సినిమా గాంధీ పుస్తకం ఆధారంగా తాను తీస్తానని ప్రకటించారు. అయితే ఈ సినిమాకు డబ్బులు సిద్ధంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఇంతకీ ఎవరు సినిమా తీస్తారన్నారో? ఎందుకు డబ్బులు పెట్టుకోవాలో తెలుసుకుందాం.
సోనియా గాంధీ తన జీవితంలోని ముఖ్యాంశాలపై 'బీ లాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్' పేరుతో ఆత్మకథ రాసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ పుస్తకాన్ని పార్టీ విడుదల చేయగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ పుస్తకం ఆధారంగా తెలుగులో సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించారు. ఈ సినిమా కోసం నగదు సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
సంగారెడ్డిలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ జీవిత చరిత్రను ప్రజలకు సినిమాగా చూపించాలని.. ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంక గాంధీలకు తల్లిగా ఆమె జీవితాన్ని సినిమాలో చూపిస్తానని వెల్లడించారు. విజయవంతమైన రాజకీయ జీవితం సోనియా గాంధీది అని.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలు అని తెలిపారు. సోనియా గాంధీ సినిమాకు సంబంధించి ఓ కమిటీ వేసి షూటింగ్‌ను ప్రారంభిస్తానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు.
సోనియాగాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందిరా, రాజీవ్ గాంధీలు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాలను దగ్గరుండి చూశారు. సోనియాగాంధీకి ప్రధానమంత్రి కుర్చీపై వ్యామోహం లేదు. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కూడా పీవీ నరసింహరావును సోనియా గాంధీ గద్దెనెక్కించారు' అని జగ్గారెడ్డి వివరించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రిగా సోనియా గాంధీ ఉండాలని కోరారని.. కానీ ఆమె మాత్రం మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిని చేశారని వెల్లడించారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా సోనియా గాంధీ వదులుకున్నారని.. అది ఓ చరిత్ర అని ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది సోనియా గాంధీ కోరిక అని.. అది నెరవేర్చేందుకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి కోరారు.