SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kia Investment: రాయలసీమలో 'కియా' భారీ పెట్టుబడి.. రూ.19 వేల కోట్లతో మరో ప్లాంట్

Kia India Rs 19k Crores Investment In Andhra Pradesh For Extension Another Plant: కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కొరియా కంపెనీ మరో భారీ పెట్టుబడి పెట్టబోతున్నది. ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను విస్తరించాలని.. మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.19 వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో కియా ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 12, 2026, 07:20 PM IST | Updated: Nov 12, 2026, 07:23 PM IST
Image Credit: Kia Investment In AP
Join

Kia Extension: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొరియా కంపెనీ భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇప్పటికే ప్లాంట్‌ ఏర్పాటుచేసి అక్కడి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించిన కియా కంపెనీ మరో శుభవార్త వినిపించింది. సంస్థను మరింత విస్తరించాలని.. అందులో భాగంగా మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కియా సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికోసం రూ.19 వేల కోట్లతో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించగా.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో కియా సంస్థ ఒప్పందం చేసుకుంది.

విశాఖపట్టణంలో గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో కియా కార్పొరేషన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ సమక్షంలో ఒప్పందం జరిగింది. పెనుకొండలో మరో ప్లాంట్ ఏర్పాటుకు రూ.19 వేల కోట్ల పెట్టుబడిగా పెట్టేందుకు కియా సంస్థ ముందుకు వచ్చింది. కొత్త ప్లాంట్‌ ఏర్పాటుతో కొత్తగా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని కియా సంస్థ తెలిపింది.

ప్రస్తుతం పెనుకొండ ప్లాంట్ నుంచి ఏడాదికి 4.3 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తుండగా.. మరో ప్లాంట్‌ ఏర్పాటుతో ఏడాదికి అదనంగా మరో 2 లక్షల కార్ల ఉత్పత్తి జరగనుంది. దీంతో మొత్తంగా ఏడాదికి 6.3 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి కియా సంస్థ చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్ యూనిట్‌లో తయారైన మేడ్ ఇన్ ఏపీ కార్లను 100కు పైగా దేశాలకు కియా సంస్థ ఎగుమతి చేస్తోంది. సత్యసాయి జిల్లా ఎర్రమంచిలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు కియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలుచేశారు. 'అనంతపురంలోని పెనుకొండకు కియా సంస్థ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ సంస్థను ఏపీకి తీసుకువచ్చేందుకు విస్తృత ప్రయత్నాలు చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకువచ్చి కియా ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాం' అని వివరించారు. జాతీయ రహదారితోపాటు బెంగుళూరు ఎయిర్ పోర్టు కనెక్టివిటీ కల్పించి ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించినట్లు తెలిపారు. స్వయంగా దక్షిణ కొరియాకు వెళ్లి కియా యాజమాన్యంతో మాట్లాడి 14 నెలల్లోనే ప్లాంట్ నిర్మించినట్లు.. ఏపీలో తయారైన తొలి కియా కారును ప్రారంభించుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

'ఇప్పుడు మేడ్ ఇన్ ఏపీ కియా కార్లు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏపీపై నమ్మకం ఉంచి మళ్లీ రూ.19 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావటం అభినందనీయం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం పారిశ్రామిక వేత్తలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక నుంచి ఏపీలో ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్టును కూడా పెట్టుబడులకు రక్షణగా తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.

'విదేశీ పెట్టుబడులకు కూడా ఏపీ ఓ నమ్మకమైన భాగస్వామిగా ఉంది. అందుకే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మాకే వచ్చాయి. సామాజిక బాధ్యతగా కియా పీ4 కార్యక్రమానికి కూడా సహకరించాలని కోరుతున్నా' అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నైపుణ్యం ఉన్న యువత ఏపీలో ఉందని.. అవకాశాలు కల్పిస్తే పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES