Andhra Pradesh Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు రణరంగంగా మారాయి. అధికార పార్టీ టీడీపీ వేధింపులు.. దాడులు చేస్తుండడంతో ప్రత్యర్థి పార్టీలు పోటీలో నిలబడకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే స్థానిక ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు ప్రవేశించడంతో పరిణామాలు వేగంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తక్షణమే ఆయా స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబర్ 14వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్లు జారీ అవగా... షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు, 19న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది.
అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో తీవ్ర వివాదాలు.. రణరంగాన్ని తలపించేలా పరిణామాలు చోటుచేసుకోవడంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులను అడ్డుకున్నారని.. కొన్ని ప్రాంతాల్లో చట్టం, శాంతిభద్రతల పరిస్థితుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయారని వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పై ఆదేశాలు ఇచ్చాయి. విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్ 25వ తేదీ వరకు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రచురణను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నామినేషన్లు సమర్పించలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, వాటికి సంబంధించిన ఆధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పరిశీలించి అవసరమైన ప్రాంతాల్లో నామినేషన్ల గడువు పొడిగింపుపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. గడువు పొడిగించాలని నిర్ణయించిన ప్రాంతాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించి.. నిర్ణయం ప్రకటించిన సమయం నుంచి కనీసం 48 గంటల గడువు ఇవ్వాలని స్పష్టం చేయడంతో ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో తదుపరి ఎన్నికల ప్రక్రియ ఆపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ల నుంచి నివేదికలు పొందిన తర్వాత అక్టోబర్ 22న ఎన్నికల సంఘం తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.