YSRCP: పసుపు చొక్కాలు వేసుకోకున్నా టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Peddireddy Ramachandra Reddy Press Meet: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని.. వారి ద్వారా చంద్రబాబు ఎన్నికలు జరిపిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు జైలులో పెడుతున్నారని విమర్శించారు.
Guntur Jail: 'రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి, పోలీసులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్‌సీపీకి మధ్య ఎన్నికలు జరగడం లేదు' అని వైఎస్సార్‌సీపీ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమ కేసులు, 307 సెక్షన్లు, అరెస్టులే కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఎవరైతే ఎన్నికల్లో చురుగ్గా తిరుగుతున్నారో ఆ నాయకులందరినీ లక్ష్యంగా చేసుకుని జైలులో పెడుతున్నారని ఆరోపించారు. మిగతా ఎన్నికల్లో వారు పాల్గొనకుండా అడ్డుకుని, తమకు ఇష్టం వచ్చినట్లు ఫలితాలు ప్రకటించుకుంటున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరు జిల్లా జైలులో వైఎస్సార్‌సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, పలువురు నాయకులు పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున నాశనం చేసిన ఘనత భారతదేశంలో ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని ప్రకటించారు. పోలీసుల ద్వారా కొత్త పద్ధతుల్లో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని.. ఇది వైఎస్సార్‌సీపీ మీద దాడి కాదు.. ప్రజాస్వామ్యం మీద దాడి అని సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పసుపు చొక్కాలు వేసుకోకపోయినా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. 'తప్పంతా పోలీసులదే.. అన్యాయాలు చేస్తున్నది మీరే. రేపు బాధ్యత వహించాల్సింది కూడా మీరే. ఎంత ఉప్పు తింటే అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ప్రతి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికీ వస్తుంది' అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు సృష్టిస్తున్న ఈ దుష్ట సిద్ధాంతానికి పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహించాం? ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఎలా నిర్వహిస్తోంది? ప్రజలు ఆలోచిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ ప్రజాతీర్పును అడ్డుకోవాలని చూస్తే ప్రజాస్వామ్యానికి మరింత నష్టం జరుగుతుందని చంద్రబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.
ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది.. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. 'పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి నేతలు అరాచకాలు చేస్తున్నారని.. పోలీసుల బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడరు అని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూటమి నాయకులు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గతంలో ఈవీఎంలు.. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్‌లతో కూటమి అక్రమాలు చేస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటకు వస్తే చంద్రబాబుకు వణుకు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.