Raptadu Incident Accused Hemanth: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని శనివారం ఉదయం యథావిధిగా బడికి చేరుకుంది. మొదటి పీరియడ్‌లో గణిత ఉపాధ్యాయిని రాజరాజేశ్వరి పాఠం చెబుతుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీల ఆటో వెనుకాలే నిందితుడు హేమంత్ లోపలికి ప్రవేశించాడు. వెలుపల ఎలక్ట్రిక్ రంపాన్ని స్టార్ట్ చేయడంతో ఉపాధ్యాయిని చెట్ల కొమ్మలు నరుకుతున్నారని భావించారు.
అయితే, ఒక్కసారిగా తరగతి గదిలోకి దూసుకొచ్చిన నిందితుడు, ఉపాధ్యాయిని కోలుకునేలోపే చేతిలో ఉన్న ఎలక్ట్రిక్ రంపంతో బాలిక ముఖం, గొంతు, ఛాతీ భాగాలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరొక సహ విద్యార్థిని కాళ్లకు కూడా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు కుప్పకూలిపోగా, తోటి విద్యార్థులు భయాందోళనతో తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు.
వేధింపుల నేపథ్యం, నిందితుడి నేర చరిత్ర
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన నిందితుడు హేమంత్ (27) బాధితురాలికి వరుసకు బాబాయ్ అవుతాడు. తీవ్రమైన మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసైన అతడు, కొంతకాలంగా ఆ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని వెంటపడి వేధించేవాడు.
అతడి ప్రవర్తనను కుటుంబ సభ్యులు గట్టిగా మందలించడంతో కక్ష పెంచుకుని, పక్కా ప్రణాళికతో తరగతి గదికై వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. గతంలోనూ ఒక విద్యార్థుల హాస్టల్‌లోకి అక్రమంగా చొరబడి పిల్లలపై దాడి చేసిన నేరచరిత్ర అతడికి ఉందని స్థానికులు వెల్లడించారు.
వైద్య సాయం, పటిష్ఠ పోలీసు చర్యలు..
ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో బాధితురాలిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని 'గ్రీన్ ఛానెల్' ఏర్పాటు చేసి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మార్గమధ్యంలో అత్యవసర వైద్య బృందం రక్తం, ప్లాస్మా ఎక్కిస్తూ ప్రాణాపాయం తప్పించేందుకు శ్రమించింది.
మరోవైపు బైక్‌పై పారిపోతున్న నిందితుడిని ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ వద్ద గేట్‌మ్యాన్ ఫొటో తీశాడు. ఆ ఆధారంతో పోలీసులు సమర్థవంతంగా నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా పాఠశాల భద్రతా ప్రమాణాలు, అధికారుల జవాబుదారీతనంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.