SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించనున్న అజ్ఞాత భక్తుడు.. నేడు CM చంద్రబాబు సమక్షంలో అప్పగింత!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 74,873 మంది దర్శించుకున్నారు. వీరిలో 22,810 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ తెలిపింది. ఇక తిరుమలలో నేడు ఒక అద్భుతమైన ఘట్టం చోటుచేసుకోనుంది. తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు భారీ కానుక సమర్పించనున్నారు. ఇప్పటికే ఆయన తిరుమలకు చేరుకున్నారు, కానుకలు కూడా వచ్చేశాయి. 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 26, 2026, 07:13 IST | Updated: Nov 26, 2026, 07:16 IST
Image Credit: Tirumala 121 Kg Gold Donation:
Join

Tirumala 121 Kg Gold Donation: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు తమ కోరికల మేరకు శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు, హుండీలో కానుకలు వేస్తారు. మరికొంతమంది భక్తులు అపార భక్తితో ఆయనకు ఆభరణాలు చేయిస్తుంటారు. అయితే తిరుమల చరిత్రలోనే నేడు అతిపెద్ద విరాళం అందనుంది. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను ఒక అజ్ఞాత భక్తుడు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. ఆయన సమక్షంలోనే ఈ అపూర్వ కానుక శ్రీవారికి అందనుంది.

ఇప్పటికే తిరుమలకు చేరుకున్న ఆ అజ్ఞాత భక్తుడితోపాటు 121 కిలోల బంగారు ఆభరణాలు ఒక లారీలో పెట్టెల్లో వచ్చేశాయి. భారీ ఎత్తున బంగారు ఆభరణాలను విరాళంగా అందించడానికి ఈ దాత సన్నద్ధమయ్యారు. రంగనాయకుల మండపంలో బంగారు ఆభరణాల ప్రదర్శనకు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉదయం 11:30 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో విరాళం సమర్పించనున్నారు. ఆయన చేతుల మీదుగా టీటీడీ ఈవోకు ఆభరణాలు అందజేయనున్నారు. శ్రీవారిపై అపారమైన భక్తి కలిగిన ఒక భక్తుడు ఈ భారీ బంగారు కానుకను అందించడంతో, భక్తుల్లోనూ ఈ ఆభరణాలపై ఆసక్తి పెరిగింది.

సీఎం తిరుమల పర్యటన..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమల పర్యటన చేయనున్నారు. ఆయన గురువారం ఉదయం 8:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, 10 గంటల సమయానికి తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. 10:45 గంటలకు గాయత్రి నిలయానికి చేరుకుని, ఆ తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటారు. 11:35 గంటల సమయంలో తిరుమల శ్రీవారి బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. దాతల నుంచి బంగారు ఆభరణాలను అధికారికంగా స్వీకరించే కార్యక్రమం కూడా ఉంటుంది. గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి కిరీటం, పద్మ పాదాలు వంటి ఆభరణాలను స్వీకరించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తిరుమల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేనికి వెళ్తారు. సాయంత్రం మళ్లీ అమరావతికి చేరుకుంటారు.

టీటీడీకి 14 టన్నుల కూరగాయల విరాళం..
తిరుమల శ్రీవారి భక్తులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భక్తిని చాటుకుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీ కొల్లా అశోక్ అనే భక్తుడు, తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనానికి 14 టన్నుల తొమ్మిది రకాల కూరగాయలను బుధవారం విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా అన్నప్రసాద విభాగం అధికారులకు వాటిని అందజేశారు.

కొనసాగుతున్న రద్దీ..
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు నిండి ఉన్నాయి. ఎస్ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 74 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 22 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.38 కోట్లుగా నమోదైంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES