Tirupati Sri City Boiler Blast 4 killed: తిరుపతిలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీ సిటీలోని హెల్త్ కేర్ కంపెనీలో నైట్ షిఫ్ట్ సమయంలో బాయిలర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నైట్ షిఫ్టులో పనిచేస్తున్న కార్మికులు ఈ పేలుడు కారణంగా చిక్కుకుపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. భారీ శబ్దంతో జరిగిన ఈ పేలుడు కారణంగా నలుగురు మరణించగా, మరొక కార్మికుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాయిలర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇది సాంకేతిక లోపమా? లేక అధిక ఒత్తిడి వల్ల జరిగిందా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. అలాగే, ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది.
నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి..
తిరుపతి శ్రీ సిటీలో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం అని ఆయన అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూనే, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొంటూ, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.