విశాఖ బీచ్‌లో విషాదం.. రుషికొండలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు! దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబుకు తండ్రి గుండెకోత మెసేజ్!
విశాఖ రుషికొండ బీచ్‌లో ఈత కొడుతూ ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఒక్కసారిగా కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వారిలో ఒకరి మృతదేహం రాత్రి ఒడ్డుకు కొట్టుకొచ్చింది, మిగతా వారి కోసం గాలింపు చర్యలు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నిన్న సాయంత్రం విశాఖ రుషికొండ బీచ్‌లో 9వ తరగతి విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయాన్నే కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పిల్లల కోసం తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఉదయాన్నే బీచ్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్న బంధువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థుల గల్లంతవ్వడం వల్ల మల్లయ్య పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది, మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సముద్ర తీరంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రుషికొండ ఐటి హిల్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గాంధీ జయంతి సెలవు కావడంతో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సముద్రానికి వెళ్లారు. అలల తాకిడికి మధురవాడలోని మల్లయ్యపాలెంగా చెందిన విద్యార్థులు సూర్యప్రకాష్, నీలీష్, ప్రశాంత్ నీటిలో మునిగిపోయారు. మెరైన్ లైఫ్ గార్డ్ సిబ్బంది గాలింపు చేపట్టిన తర్వాత ఒక విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల కోసం నేవీ కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. విద్యార్థుల గల్లంతైన ఘటనతో మల్లయ్యపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన వారిలో తన కుమారుడు సూర్యప్రకాష్ ఉన్నాడని గల్ఫ్ దేశంలో ఉన్న తండ్రి భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడిని చివరిసారి చూసేందుకు తనను భారత్‌కు రప్పించాలని ఆయన వేడుకున్నారు. అయితే, తన పని చేసే సంస్థ అధికారులు భారత్ వెళ్లేందుకు అనుమతించడం లేదని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనను భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశాడు.
Read Also: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
వీడియోలో ఏముందంటే?
ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్‌కు నమస్కరించి... అయ్యా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి నమస్కరిస్తూ చెప్తున్నాను. నా పేరు భాస్కర్ కుమార్, నేను దుబాయ్‌లో ఉంటున్నాను. మా అబ్బాయి ఈరోజు రెండు గంటలకు రుషి కొండ బీచ్‌లో మునిగిపోయాడు. మొత్తం ముగ్గురు మునిగిపోయారు, అందులో ఒకరు బయటకు వచ్చారు. ఇంకా ఇద్దరు రాలేదు. ఆ ఇద్దరిలో నా కొడుకు కూడా ఉన్నాడు. నేను ఆఫీస్‌కు వెళ్లి మా అబ్బాయి చనిపోయాడు, నాకు పాస్‌పోర్ట్ ఇప్పించమని అడిగితే, రేపు డ్యూటీకి వెళ్లి సాయంత్రం లెటర్ తీసుకొని రమ్మని, ఆ తర్వాత కంపెనీకి మెయిల్ పెడతానని చెబుతున్నారు. ఎలాగైనా సరే నా చిన్న కొడుకు మొహం చూసేలా చూడండి అయ్యా. నేను ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను, ఎలాగైనా సరే నాకు పాస్‌పోర్ట్ ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఆయన వేడుకున్నారు.