Bomb threatening mail to hyderabad police: హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల బాంబులు పేలుతాయంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. లష్కరే తోయిబా పేరుతో మెయిల్ రావడంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా 26/11 ఉగ్రదాడి తరహాలో పేలుళ్లు ఉంటాయని అందులో రాసుకొచ్చారు. కాచీగూడలోని హోటల్ టూరిస్టు ప్లాజా , రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.
జమ్ముకశ్మీర్ లష్కరే తొయిబా టాప్ కమాండార్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హత్యకు ప్రతీకరంగా దాడులు చేస్తామని ఆ మెయిల్ లో ఉంది. దీంతో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులను అలర్ట్ చేశారు.
మరోవైపు సిటి వ్యాప్తంగా రైల్వేస్టేషన్ లు, బస్టాండ్ లు, హోటళ్లు, ప్రార్థన మందిరాల వద్ద పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా పెంచారు. అన్ని భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అధికారుల్ని ఆదేశించారు. దీంతో నగరం వ్యాప్తంగా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.