Adoni New District Demand: అక్కడ జరుగుతున్న పోరాటం ఒక కులం కోసం కాదు.. ఒక ఊరి కోసం కాదు.. కరువు సీమ కడుపుకోతను తీర్చడం కోసం..! ఘనమైన చారిత్రక నేపథ్యం.. తిరుగులేని వాణిజ్య ప్రాధాన్యం.. లక్షలాది జనాభాతో కూడిన విస్తారమైన భౌగోళిక విస్తీర్ణం.. ఇలా ఒక జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు పుష్కలంగా ఉన్నా.. పాలకులు మాత్రం ప్రత్యేక జిల్లా ఏర్పాటును అటకెక్కించారు. రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాంతాలు సైతం జిల్లా కేంద్రాలుగా రూపాంతరం చెందుతుంటే.. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆదోని డివిజన్‌ను మాత్రం పాలకులు విస్మరించారు. ఆదోని కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలంటూ ప్రజాసంఘాలు, కార్మికులు, విద్యార్థులు, రైతులు ఏకతాటిపైకి వచ్చి గ్రామ సభలతో కదం తొక్కుతున్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.
ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమం కేవలం పట్టణానికే పరిమితం కాకుండా పల్లెపల్లెకూ విస్తరిస్తోంది. ఆదోని డివిజన్ పరిధిలోని ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం వంటి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలలో పర్యటిస్తూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల మద్దతుతో జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం రాత్రి దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొని ప్రత్యేక జిల్లా డిమాండ్‌ను బలంగా వినిపించారు.
ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా పరిపాలనాపరంగా, ఆర్థికపరంగా ఈ ప్రాంతానికి సమూల మార్పులు వస్తాయని ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన కర్నూలుకు వెళ్లాలంటే ఎమ్మిగనూరు, ఆలూరు, హాలహర్వి, హోళగుంద వంటి సరిహద్దు గ్రామాల ప్రజలు 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. కలెక్టరేట్ పని నిమిత్తం వెళితే రోజంతా సమయం, వందలాది రూపాయల ఖర్చు అవుతోంది. ఆదోని జిల్లా అయితే ప్రభుత్వ పాలన ప్రజల ముంగిట్లోకి వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఏదైనా ప్రమాదం లేదా తీవ్ర అనారోగ్యం సంభవిస్తే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ఉచితంగా అందుతుంది. అలాగే విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది.
ఒకప్పుడు దక్షిణ భారత మాంచెస్టర్‌గా పేరొందిన ఆదోనిలో పత్తి వ్యాపారం, జిన్నింగ్ మిల్లులు, నూనె పరిశ్రమలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లా హోదా వస్తే వీటికి మౌలిక సదుపాయాలు మెరుగై స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. కరవు పీడిత పశ్చిమ ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు వంటి నగరాలకు జరిగే కూలీల వలసలకు అడ్డుకట్ట పడుతుంది. కొత్త జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయి ఆసుపత్రులు, ఉన్నత విద్యాసంస్థలు, కోర్టులు అందుబాటులోకి వస్తాయి.
గతంలో జిల్లాల పునర్విభజన చేపట్టినప్పుడు తీవ్ర వెనుకబడిన ఆదోని డివిజన్‌ను జిల్లాగా ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు. కానీ స్థానిక నాయకుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నా.. పాలక వర్గాలు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం మౌనం వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆదోని జిల్లా ఏర్పాటు అనేది రాజకీయ లబ్ధి కోసమో.. లేదా తాత్కాలిక సెంటిమెంట్ కోసమో కాకుండా.. వెనుకబడిన పశ్చిమ రాయలసీమ ప్రాంత సమగ్ర పురోగతి కోసం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా.. ప్రజాభీష్టాన్ని గౌరవించి ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందంటున్నారు.