YS Jagan: గంజాయి, బెల్టు షాపులే రాప్తాడు ఘటనకు కారణం.. కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
YS Jagan meets raptadu girl in manipal: ప్రస్తుత ప్రభుత్వం బాధిత బాలిక కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా స్కూల్లోనే దాడులు జరగటం ఏంటని మండిపడ్డారు.
YS Jagan meets raptadu incident girl in manipal hospital: ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం రాప్తాడు ఘటన బాధితురాలికి ప్రస్తుతం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలిక ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలు గోపికను పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
ఈ క్రమంలో బాలికను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్టాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి మరీ దాడులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాప్తాడు ఘటనకు ఏపీలో విపరీతంగా పెరిగిపోయిన బెల్ట్ షాపులు, గంజాయి అక్రమ విక్రయాలే కారణమని ఆరోపించారు.
గంజాయి, మద్యం దుకాణాలను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తెచ్చి.. పిల్లలను వాటికి బానిసల్ని చేస్తున్నారని విమర్శించారు. వీటిని అరికట్టడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే బాధితుల తరఫున పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వంను వైఎస్ జగన్ హెచ్చరించారు. ఇక గత నెల చివర్లో అక్టోబర్ 31న రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోనే బాధితురాలిపై ఆమెకు సమీప బంధువైన హేమంత్ తనతో పెళ్లికి నిరాకరించిందని ఆమెపై రంపంతో దాడి చేశాడు.
ఈ ఘటనను అడ్డుకున్న మరో బాలిక సైతం తీవ్రంగా గాయపడింది. హేమంత్ పోలీసులపై ఆత్మకూరు అడవిలో దాడి చేయడంతో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన హేమంత్ రెండు కాళ్లను తొలగించే పరిస్థితి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.