SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YS Jagan Letter to Sharmila: వైఎస్ షర్మిల కూతురు పెళ్లి.. వైఎస్ జగన్ సంచలన లేఖ

YS Jagan Letter to Sharmila: వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి వివాహ వేదికకు సంబంధించి బెంగళూరు నివాసంపై జరుగుతున్న ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరదించారు. ఈ మేరకు షర్మిలకు ఆయన ఓ లేఖ రాశారు. పూర్తి వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 24, 2026, 04:59 PM IST | Updated: Oct 24, 2026, 05:00 PM IST
Join

YS Jagan Letter to Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూతురు పెళ్లికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లు ఇవ్వలేదని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ లేఖ విడుదల చేశారు. అంజిలి పెళ్లి గురించి తెలిసి తనకు చాలా సంతోషంగా ఉందని.. గత ఏడేళ్లుగా తమ మధ్య ఎన్ని పరిణామాలు జరిగినా ఆమె జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. అయితే తన అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని తన నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని షర్మిల భావిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తాను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని.. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా తెలియజేశానని చెప్పారు. లేఖలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..

"అంజిలి పెళ్లి గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినా, అంజిలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని నా నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని నువ్వు భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేశాను. పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. క్యాటరింగ్‌, డెకరేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది ప్రాంగణంలోకి వస్తారు. వీరిలో చాలామంది మనకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులే. ఇంతమంది నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి.

నివాస ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాలేదు. జిలీ చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని నేను చూశాను. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేను. నా కూతుర్లు హర్ష లేదా వర్ష పెళ్లి అయినా కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. ప్రస్తుతం నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుంది.

చివరకు ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలను ఇప్పటికే నీకు తెలియజేసినా, నా అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నన్ను బాధించింది. ఈ విషయంలో నా పరిస్థితిని, అభిప్రాయాన్ని మరోసారి పరిగణనలోకి తీసుకుని పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను.

రాజా పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్‌ సెంటర్‌లో గానీ, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవచ్చు. అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని నా లోటస్‌ పాండ్‌ ఆస్తిని పెళ్లికి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాను. లోటస్‌ పాండ్‌ ఆస్తిని ఉపయోగించుకోవడానికి ఇచ్చిన ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది.
జిలీ పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని ఆశిస్తున్నాను. అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు కూడా నా దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.." అని వైఎస్ జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES