Dindi Project: మహబూబ్‌నగర్ ప్రజల గొంతు నులిమేలా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. డిండి ప్రాజెక్టును ఉరితాడుగా వేస్తున్నాడని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగం కాని డిండి లిఫ్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డి.. సొంత జిల్లా రైతులకు ద్రోహం తలపెట్టడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టూ పాలమూరుకే దక్కాలని కోరారు.
'నల్గొండకు నీళ్లందించేందుకు ఎస్ఎల్బీసీ, నక్కలగండి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. పాలమూరు హక్కులను కాలరాయడం ఎందుకు?' అని రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాం నాటి జీవో 72 ప్రకారం జూరాల ఆధారిత పాత డిజైన్‌తోనే పూర్తి చేయాలని కోరారు. పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరిట పాలమూరు జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. రేవంత్ రెడ్డికి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఏమాత్రం ప్రేమ లేదని స్పష్టమవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆశీర్వదించి గెలిపించడంతోనే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారనే వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ సూచించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు.. ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో జూరాల ప్రాజెక్టు ఆధారంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సర్వే కోసం జీవో నెంబర్ 72ను తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఉరితాడుకు మరింత ఉచ్చు బిగిస్తూ డిండి లిఫ్ట్ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చి పాలమూరుకు దగా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతాల సమస్య పరిష్కారానికి పుట్టగండి లిఫ్ట్, ఎస్ఎల్బీసి (ఏఎంఆర్ ప్రాజెక్ట్), నక్కలగండి వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని ఎంపీ అరుణ వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని డిండి లిఫ్ట్‌ను బలవంతంగా లింక్ చేస్తూ.. ఏదుల రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్లు వేసి నీటిని తరలిస్తామని చెప్పడం పాలమూరు జిల్లా రైతుల హక్కులను హరించడమేనని ఎంపీ డీకే అరుణ తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అదనంగా ఒకటి లేదా రెండు టీఎంసీలు తోడే సామర్థ్యం ఉంటే ఆ నీటినంతా ఇంకా లక్షలాది ఎకరాలు బీడుపడి ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు కాల్వలతో దాదాపు 60 కిలోమీటర్ల మేర పాలమూరు భూములు, 30కి పైగా గ్రామాలు ముంపునకు గురవుతుంటే ఇక్కడి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నల్గొండ నాయకులు తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఏకమవుతుంటే పాలమూరు ప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం జిల్లా హక్కులను తాకట్టు పెడతారా అని ఎంపీ డీకే అరుణ నిలదీశారు.
పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు దశాబ్ద కాలంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయని ఎంపీ డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కింద ఉన్న 15.9 టీఎంసీలు, జూరాల కింద ఉన్న 17.84 టీఎంసీల కేటాయింపులను కూడా పూర్తిస్థాయిలో ఒడిసిపట్టలేక రేవంత్ రెడ్డి వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని ఎంపీ అరుణ స్పష్టం చేశారు. పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం రాజీలేని ప్రజాపోరాటం నిర్మిస్తామని రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు.