Sachivalaya Employees: తమ డిమాండ్ల సాధన.. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఆందోళన చేపట్టగా.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అరెస్ట్.. దాడులు ఎందుకు అని ప్రశ్నించారు.
వైఎస్సాఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు మార్కు రెడ్‌బుక్ రాజ్యాంగంతో సచివాలయ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు. సచివాలయ ఉద్యోగుల నిరసనను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు?' అని ప్రశ్నించారు. నోషన్ ఇంక్రిమెంట్లు, పదోన్నతి మార్గంపై 27 నెలలుగా ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించలేదెందుకు? అని నిలదీశారు.
'ఉద్యోగుల ధర్నాను అడ్డుకునేందుకు ఎంపీడీవోలు, కలెక్టర్లు, పోలీసులను ఉపయోగించడం దేనికి సంకేతం? ఆడపిల్లలను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లేంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందా?' అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జీలు, అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావని.. వారితో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థను కుదిస్తూ ఉద్యోగులపై పని భారం పెంచుతున్నారని విమర్శించారు. 15,004 సచివాలయాలను 7,715కు కుదించే చర్యలు ఎందుకు చేపట్టారు? అని నిలదీశారు.
ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేస్తున్న సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలి.. సచివాలయ ఉద్యోగులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
'గోవాడ షుగర్ బకాయిలు చెల్లింపు వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. ప్రభుత్వం రూ.28 కోట్లు రుణంగా ఇస్తుందని చెప్పి మోసానికి తెరతీసింది. ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి బకాయిలు చెల్లిస్తామని చెప్పడం దారుణం. షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మాలన్న నిర్ణయం అంగీకరించాం. సెప్టెంబర్ 28వ తేదీన ఆందోళన చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ నడిపే అవకాశం ఉన్నా ఎందుకు నడపటం లేదు? వైసీపీ ప్రభుత్వం రూ.90 కోట్లు రుణం గ్రాంట్ ప్రకటిస్తే ఈ ప్రభుత్వం ఆస్తులు అమ్మడానికి యత్నిస్తోంది' అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.