Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి, ఇతర ప్రముఖులు
Meenakshi Choudary And Other VIPs Visits To Tirumala: బ్రహ్మోత్సవాల అనంతరం తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వారాంతం ముగిసిన తర్వాతి రోజు సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Tirumala VIPs Visit: బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం తిరుమల ఆలయానికి భక్తుల సంఖ్య పెరిగింది. సాధారణ భక్తులతోపాటు పలు రంగాల ప్రముఖులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పలువురు ప్రముఖలు తిరుమల వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. సినీ రంగ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు తిరుమల క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున సామాన్య భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు నారా రోహిత్ శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కూడా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకోగా.. వారికి రంగనాయక మండపంలో వేద పండితులు ఘనంగా ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాలను అందజేశారు.
సుప్రభాత సేవలో హీరోయిన్
శ్రీవారిని సుప్రభాత సేవ సమయంలో సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున జరిగిన సుప్రభాత సేవ సమయంలో ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మీనాక్షి చౌదరి 'శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా. తిరుమల రావడం, శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతినిస్తుంది' అని మీనాక్షి చౌదరి తెలిపారు.
ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉత్సవాలు ముగిసిన తర్వాత తొలి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలను సందర్శించారు. నిన్న శ్రీవారిని మొత్తం 83,578 భక్తులు దర్శించుకోగా.. 31,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.5.07 కోట్ల ఆదాయం లభించగా.. 4.39 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. అన్నప్రసాదం 2.88 లక్షల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్ కొనసాగుతోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతుంది.