SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Illegal Soil Sand: అక్రమ మట్టి దందా కలకలం.. సరిహద్దులు దాటుతున్న మట్టి..!

Illegal Soil Sand: నెల్లూరు నియోజకవర్గంలో అక్రమ మట్టి దందా కలకలం రేపుతోంది! పాలసముద్రం మండలంలో కొండలు, గుట్టలు పిండిపిండి అవుతున్నాయి. కృష్ణజిమ్మాపురం, అత్తిమంజరిపేట పరిసరాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ భారీగా మట్టిని సరిహద్దులు దాటించేస్తున్నారు. గతంలో సహజ వనరుల దోపిడీపై మాట్లాడిన నేతలే... ఇప్పుడు సొంత ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నా మౌనం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇంతకి ఈ మట్టి దందా వెనుక అసలు కథేంటి? అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్.

Written By Ashok Krindinti
Published: Oct 08, 2026, 08:26 AM IST | Updated: Oct 08, 2026, 06:28 PM IST
Image Credit: Illegal Soil Sand
Join

Illegal Soil Sand: చిత్తూరు జిల్లా జిడి పాలసముద్రం మండలం వేదికగా సాగుతున్న అక్రమ మట్టి దందా స్థానికంగా సంచలనంగా మారింది. అనుమతులు ఉన్నాయో లేదో తెలీదు కానీ.. భారీ యంత్రాలు నిరంతరం గర్జిస్తూనే ఉన్నాయి. కృష్ణజిమ్మాపురం పరిసరాల్లోని కొండలు, గుట్టలను నిలువునా తవ్వేస్తూ, సరిహద్దుల గుండా తమిళనాడులోని అత్తిమంజరిపేటకు మట్టిని యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఇక్కడ సాగుతున్న తవ్వకాలు చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ హిటాచీలు, 50కి పైగా టిప్పర్లు రీ సౌండ్ చేస్తూ మట్టిని తరలిస్తున్నాయి. నిమిషానికో టిప్పర్ రాకపోకలు సాగిస్తుండటంతో... గ్రామాలు మట్టి మయంగా మారిపోయాయి. రోడ్లపై దుమ్ము లేచి ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మట్టి వ్యాపారుల అరాచకం ఇక్కడితో ఆగలేదు. తమ స్వార్థం కోసం రైతుల కడుపు కొడుతున్నారు. ఏకంగా పేద రైతుల పొలాల మీదుగా అక్రమంగా దారులు ఏర్పాటు చేసి, రాత్రింబవళ్లు భారీ వాహనాలను నడుపుతున్నారు. తమ అనుమతి లేకుండా భూముల్లో రోడ్లు వేసి పంటలకు, భూములకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని సహజ వనరులను నిలువునా దోచేస్తూ.. సరిహద్దు దాటించి తమిళనాడులో కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకు వందలాది ట్రిప్పుల మట్టి సరిహద్దు దాటుతున్నా.. చెక్ పోస్టులు, నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా కొండలు, గుట్టలను పిండి చేస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ సహజ సంపదను పక్క రాష్ట్రానికి తరలిస్తున్నా...మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎందుకు కళ్లు అప్పగించి చూస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఈ మట్టి మాఫియా వెనుక ఓ కంపెనీ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులే ఈ కార్యకలాపాలన్నింటినీ నడిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో అక్రమ తవ్వకాలు, సహజ సంపద దోపిడీపై మైకులు పగలేలా మాట్లాడిన స్థానిక నేతలు...ఇప్పుడు తన సొంత మండలంలోనే ఏపీ మట్టి తమిళనాడుకు తరలిపోతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని గ్రామస్తులు నిలదీస్తున్నారు. నాడు ప్రశ్నించిన గళం... నేడు మైనింగ్ మాఫియా ముందు ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఈ తవ్వకాలకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎంత మేర తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు? పరిమితికి మించి అక్రమంగా మట్టిని సరిహద్దులు దాటిస్తున్నారా? అనే విషయాలపై అధికారులు నిష్పాక్షిక విచారణ జరపాల్సి ఉంది. కేవలం ఆరోపణలుగా కొట్టిపారేయకుండా క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలను తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా పాలసముద్రం మండలంలో సాగుతున్న ఈ మట్టి వ్యవహారంపై అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. రైతుల పొలాలను తొక్కుకుంటూ, ఏపీ సహజ సంపదను తమిళనాడుకు తరలిస్తున్న ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES