టీటీడీ చైర్మన్ పదవి కోసం నేతల పైరవీలు షురూ.. రేసులో ప్రముఖ నిర్మాత..?
New TTD Chairman:ఆంధ్ర ప్రదేశ్‌లో క్యాబినేట్ మంత్రి పోస్ట్ కన్నా డిమాండ్ ఉంటుందో లేదో కానీ.. టీటీడీ చైర్మన్ పదవి కోసం అంతకంటే ఎక్కువ పోటీ ఉంటుంది. టీటీడీ చైర్మన్ పోస్ట్ కోసం ఏపీ నేతలు ఎవరికీ వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు.జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఆశపడుతుంటారు. కనీసం అందులో బోర్డ్ మెంబర్‌గా అయిన ఛాన్స్ వస్తే చాలనుకునేవాళ్లున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు పదవి కాలం ముగిసింది. దీంతో ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేశారు. ఇక టీటీడీ కొత్త చైర్మన్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టీటీడీ రేసులో ఇద్దరూ నేతల పేర్లు తెరపైకి రావడంతో.. వీరిలో ఒకరికి టీటీడీ చైర్మన్ పోస్టు ఖాయమనే చర్చ సాగుతోంది.
Who Will Be The Next TTD Chairman: రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. టీటీడీ చైర్మన్ పదవి మొదటగా బీఆర్ నాయుడికి దక్కింది. ఇప్పుడాయన పదవీకాలం పూర్తయ్యింది. దాంతో టీటీడీ కొత్త చైర్మన్ ఎవరనే ఉత్కంఠ కూటమి నేతల్లో నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ చైర్మన్ పదవిని నేతలు గొప్పగా భావిస్తారు.. ఆ పదవి దక్కితే చాలు తమ జన్మ ధన్యం అయ్యినట్టుగా భావిస్తారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తరించే మహాభాగ్యం కలుగుతుందనే భావనతో టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తుంటారు. కొంత మంది మాత్రం అదో సేవ కాకుండా అధికార దర్పంగా భావించే వాళ్లున్నారు. ఏది ఏమైనా శ్రీవారిని దగ్గరుండి సేవ చేసుకునే భాగ్యం చైర్మన్ పోస్ట్ దక్కించుకున్నవాళ్లకు దక్కే మహద్భాగ్యం.
టీటీడీ పాలకమండలి నియామకంపై ప్రభుత్వం కసరత్తు..
అలాంటి గొప్ప పదవి కోసం మరోసారి రేసు మొదలైంది. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మిగతా పాలకమండలి గడవు ముగిసింది. కొత్త పాలక మండలిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. దాంతో కొత్త ఛైర్మన్ సహా పాలక మండలి సభ్యులు ఎవరనేది కీలకంగా మారుతోంది. కొత్త బోర్డు ఏర్పాటు అయ్యే వరకు ఐఏఎస్ ఆధ్యర్వంలో స్పెసిఫైడ్ అథారిటీ నియమించింది. టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఛైర్మన్ విషయంలోనూ దాదాపు నిర్ణయం జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో.. పూర్తయిన తరువాత అధికారికంగా ప్రకటన రానుంది. ఇక.. బోర్డు సభ్యులుగా పలువురు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం సైతం జరుగుతోంది..
మొన్నటి వరకు బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్..
ఇక కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బీఆర్ఎస్ నాయుడు మొన్నటి వరకు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 నవంబర్ 1న ఛైర్మన్ గా బీఆర్ నాయుడు, 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని నియమించారు. రెండేళ్ల కాల పరిమితి విధించారు. ఇప్పుడు ఆ సమయం ముగియటంతో కొత్త పాలక మండలి పైన కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతుండటంతో ఇవి పూర్తయిన తరువాత అధికారికంగా కొత్త బోర్డును అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. కొత్త పాలక వర్గం పైన భారీ అంచనాలు ఉన్నాయి. మూడు పార్టీల కూటమి అధికారంలో ఉండంతో... మూడు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది.
టీటీడీ చైర్మన్ రేసులో కళా వెంకట్ రావు, జ్యోతుల నెహ్రు..
ప్రస్తుతం టీటీడీ బోర్డు కొత్త ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పని చేసిన కళా వెంకటరావు, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడు నిర్మాత అశ్వనీదత్ పేరు సైతం ఛైర్మన్ రేసులోకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్యలకు అత్యంత సన్నిహితుడు. ఇక.. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి బోర్డు సభ్యులుగా ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అవకాశం దక్కనుంది. వీరితో పాటుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి బోర్డు సభ్యులుగా నియామకం చేయాల్సి ఉంది. బీజేపీ ముఖ్య నాయకత్వం ద్వారా ఇప్పటికే పలువురు సభ్యులుగా అవకాశం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో, చివరగా టీటీడీ నూతన ఛైర్మన్.. బోర్డు సభ్యులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది చూడాలి.
నిర్మాత అశ్వనీదత్ తీవ్ర ప్రయత్నాలు..
ప్రస్తుతం టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్న ఇద్దరూ టీడీపీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలే కావడం గమనార్హం. విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న మాజీమంత్రి కళా వెంకట్ రావు.. మంత్రి పదవి ఇస్తారని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో పార్టీ హైకమాండ్ పై ఆయన కాస్తా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆయన్ను కూల్ చేసేందుకు టీటీడీ చైర్మన్ ఆఫర్ చేశారని ప్రచారం జరగుతుంది. మరోవైపు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఈయనకు కళా వెంకట్ రావు మాదిరిగా నిరాశే ఎదురైంది. అయితే గత టీటీడీ బోర్టులో ఆయనకు పాలకమండలిలో అవకాశం కల్పించారు. దాంతో ఈసారి చైర్మన్ పదవి అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం జనసేన నేతలు సైతం గట్టి పైరవీలు చేస్తున్నారట. మొత్తంమీద టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ పేరు కూడా రేసులోకి రావడంతో.. టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.