TTD January 2027 darshan booking: సాధారణంగా టీటీడీ ప్రతి నెలా మూడు నెలల ముందే ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం 2027 జనవరి నెల షెడ్యూల్ విడుదలైనందున, భక్తులు అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏ దర్శనం టికెట్లు ఏ రోజు వస్తాయో పూర్తి వివరాలు ఇవే:
జనవరి దర్శనం కోసం ఎలక్ట్రానిక్ డిప్ కోటాలో సుప్రభాతం, తోమాల సేవ, అర్చన , అష్టాదళ పాద పద్మారాధన సేవలు ఉంటాయి. ఇవి అక్టోబరు 19వ తేదీ రాత్రి 10 గంటల నుండి అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ డిప్ ద్వారా ఎంపికైన వారు నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
శ్రీవారి అర్జిత సేవలకు సంబంధించిన టికెట్లలో కళ్యాణోత్సవం, ఉంజాల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారం, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం వంటివి ఉంటాయి. వీటి బుకింగ్ అక్టోబరు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
వర్చువల్ అర్జిత సేవ టికెట్లైన కళ్యాణోత్సవం, ఉంజాల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకారం సేవలు అక్టోబరు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులోకి వస్తాయి.
అక్టోబరు 23వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల అంగప్రదక్షిణ ఫ్రీ టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం ఇదే రోజు ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా బుకింగ్ అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుంది.
ఇక అక్టోబరు 24వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు, తిరుచానూరు ప్రత్యేక ఎంట్రీ దర్శనం టికెట్లు (నవంబర్ 2026 కోటాకు సంబంధించి) అందుబాటులో ఉంటాయి.
రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అక్టోబరు 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ప్రాంతాలలో గదుల కోటా బుకింగ్ కూడా జరుగుతుంది.
భక్తులు టికెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ (ttdevasthanam.ap.gov.in) లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని దేవస్థానం కోరుతోంది.
టికెట్ల బుకింగ్ విషయంలో సోషల్ మీడియాలో వ్యక్తమైన అనుమానాలకు టీటీడీ స్పష్టీకరణ ఇచ్చింది. సరైన ఇంటర్నెట్, సరైన సమయానికి ప్రయత్నిస్తే టికెట్లు దొరుకవచ్చు. లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నించడం వల్ల ట్రాఫిక్ పెరిగి అందరికీ టికెట్లు దొరకకపోవచ్చునని వివరించింది. వచ్చే నెల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల జరిగే అవకాశం ఉంది. ప్రతి ఏటా టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ ఏర్పాట్లు చేస్తుంది. పలు వీఐపీ దర్శనాలను సైతం రద్దు చేస్తూనే ఉంది.
ఇక ఈ నెల నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకు కనువిందు చేస్తున్నారు. చిన్నశేష, పెద్ద శేష, ముత్యపు పందిరితోపాటు కల్పవృక్ష వాహనాల్లో కూడా దర్శనమిచ్చారు. నవరాత్రుల నాలుగో రోజు ఉభయ దేవతలతో కలిసి బకాసుర వధాలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.