Ysrcp candidate bites tdp candidate ear in Anantapur: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వేళ పలు చోట్ల నామినేషన్ల నేపథ్యంలో వైసీపీ వర్సెస్ కూటమి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వేంపల్లిలో సర్పంచ్ నామినేషన్లపై రచ్చ కొనసాగుతుంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో వేంపల్లిలో హైటెన్షన్ నెలకొంది. స్థానిక పోలీసులు సైతం రంగంలోకి దిగి మరీ వైసీపీ, టీడీపీ నేతల్ని చెదరగొట్టారు.
ఈక్రమంలో అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలం పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తూముకుంట గ్రామ పంచాయతి పరిధిలో వార్డు సభ్యుడి నామినేషన్ దాఖలు విషయంలో వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన నేతల మధ్య వివాదం రాజుకుంది. దీంతో కార్యకర్తలు పరస్పరం తోపులాట చేసుకున్నారు. తూముకుంట వార్డుకు నామినేషన్ వేసేందుకు రఘుపతి నాయుడు వచ్చాడు. దీంతో వైసీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు ఆయనతో వాగ్వాదానికి దిగారు.
ఇద్దరి మధ్య మాటలు కాస్త గొడవలకు దారితీశాయి. దీంతో కోపంలో రెచ్చిపోయిన రామ్మోహన్ నాయుడు, రఘుపతి నాయుడిపై దాడి చేసి ఆయన కుడిచెవిని బలంగా కొరికేశాడు. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అనుచరులు, కార్యకర్తలు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గాయం తీవ్రత ఇన్ఫెక్షన్ నేపథ్యంలో చెవిలోని కొంత భాగంను వైద్యులు తొలగించారు. ఈ ఘటనపై రఘుపతి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.