AP Govt Spl Focus on Essential Commodities Rates Hike: ఏపీ ప్రభుత్వం ఎల్‌నినో కారణంగా పెరిగిన నిత్యవసరాల ధరలపై దృష్టి కేంద్రీకరించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో నిత్యావసర వస్తువుల ధరల స్థితిగతులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లో ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు అరికట్టేందుకు ప్రతివారం ప్రత్యేక సమీక్షలు నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ధరల స్థిరీకరణకు ప్రత్యేక మార్గదర్శకాలు..
ప్రజలకు అందుబాటు ధరల్లో సరుకులు అందించేందుకు ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ధరల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా సుమారు 100 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఊరటనిచ్చేలా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు సరుకులను పంపిణీ చేయనున్నారు. దీని ప్రకారం కిలో కందిపప్పు100, గోధుమ పిండి 25, లీటర్ పామాయిల్ 125 రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి.
బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు..
మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బియ్యం నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా తనిఖీలు, నిఘాను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. పప్పుధాన్యాలు, నూనెలతో పాటు నిత్యం వినియోగించే కూరగాయల ధరల హెచ్చుతగ్గులపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంట పండించే రైతులకు ఏమాత్రం నష్టం కలగకుండా, అదే సమయంలో కొనుగోలు చేసే వినియోగదారులపై అధిక భారం పడకుండా సమతుల్యత పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.