Yusuf Pathan: ఇదేనయ్యా రాజకీయం అంటే.. పార్టీ మారగానే యూసుఫ్ పఠాన్‌కు బీజేపీ బంపర్ రిటర్న్ గిఫ్ట్..!
Yusuf Pathan Land Dispute: టీఎంసీని వీడి ఎన్డీఏకు మద్దతు తెలిపిన మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం నుంచి భారీ బహుమతి ఇచ్చింది. వడోదరలో ఆయన నివాసం పక్కనే ఉన్న రూ.20 కోట్ల విలువైన వివాదాస్పద భూమి వ్యవహారం దాదాపు 14 ఏళ్ల తర్వాత అనూహ్య మలుపు తిరిగింది. పూర్తి వివరాలు ఇలా..
Yusuf Pathan Land Dispute: టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ గుజరాత్ ప్రభుత్వం నుంచి రిటర్న్ గిఫ్ట్ కొట్టేశారు. గత 14 ఏళ్లుగా నలుగుతున్న ఓ భూ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆయన నివాసానికి ఆనుకుని ఉన్న వివాదాస్పద 978 చదరపు మీటర్ల స్థలంలో 500 చదరపు మీటర్లను ‘బహుమతి’గా.. మిగిలిన భాగాన్ని భారీ రాయితీతో ఆయనకే కేటాయించేందుకు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) సిద్ధమైంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ పంపిన ప్రతిపాదన స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి.. ఎన్‌డీఏ కూటమికి మద్దతు తెలపడంతోనే యూసుఫ్ పఠాన్‌కు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి.
గత పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ నుంచి యూసుఫ్ పఠాన్ ఎంపీగా గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన 20 మంది ఎంపీల్లో ఆయన కూడా ఉన్నారు. వీరంతా తరువాత NDA కూటమిలో చేరారు. దీంతో అధికార పార్టీకి మద్దతు తెలపగానే ఆయనకు గిఫ్ట్ లభించింది. వడోదర కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ అక్టోబర్ 23న సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది. కమిటీ ఆమోద ముద్ర వేస్తే ఈ వివాదం పూర్తిగా పరిష్కారమైనట్లే.
వివాదం ఇదే..
ఈ వ్యవహారం 2012 నుంచి కొనసాగుతోంది. వడోదరలోని తండల్జాలో తన ఇంటి పక్కనున్న 978 చ.మీటర్ల స్థలాన్ని క్రీడాకారుల కోటా కింద తనకు కేటాయించాలని యూసుఫ్ పఠాన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో మున్సిపల్ కార్పొరేషన్ బహిరంగ వేలం లేకుండా 99 సంవత్సరాల లీజుపై ఆ భూమిని పఠాన్‌కి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. కానీ 2014లో ఈ ప్రతిపాదనను గుజరాత్ పట్టణాభివృద్ధి శాఖ తిరస్కరించింది. అయితే యూసఫ్ పఠాన్ ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి.. దానిని ఆధీనంలోనే ఉంచుకున్నారని అధికారులు ఆరోపించారు.
ఆ తర్వాత 2024లో ఆయనపై ఆక్రమణ ఆరోపణలు చేస్తూ.. స్థలాన్ని ఖాళీ చేయాలని కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. అప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున ఎంపీగా గెలిచిన పఠాన్.. ఈ నోటీసులను సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో ఆయన డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ప్రభుత్వ విధానం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టులో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఈ స్థలాన్ని బహిరంగ వేలం వేయాలని కార్పొరేషన్ తొలుత భావించింది. జూలైలో స్థల విలువను చదరపు మీటరుకు రూ.2.10 లక్షలుగా నిర్ణయించగా.. మొత్తం 978 చ.మీ. విలువ దాదాపు రూ.20.5 కోట్లుగా తేలింది. కానీ అనూహ్యంగా ఆ వేలం ప్రతిపాదనను అధికారులు ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామాల వెనుక రాజకీయ మార్పులు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో యూసఫ్ పఠాన్ టీఎంసీ పార్టీకి గుడ్‌బై చెప్పి.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో చేరడంతో పాటు పార్లమెంట్‌లో అధికార ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు పలికారు. ఆయన రాజకీయంగా తీసుకున్న ఈ నిర్ణయం తర్వాతే దశాబ్ద కాలంగా పరిష్కారం కాని వివాదంలో ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లభించడం గమనార్హం.