Kakinada Crime News: కాకినాడ గోల్డ్ మార్కెట్ వీధిలోని బంగారం, వెండి ఆభరణాలను కరిగించే దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసును జిల్లా పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.10 లక్షల నగదు, వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను మంగళవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎం.కిషోర్ కుమార్ డీఎస్పీతో కలిసి వివరాలను వెల్లడించారు.
గోల్డ్ మార్కెట్ వీధిలోని ఓ దుకాణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.10 లక్షల నగదుతో పాటు మూడు కిలోల వెండి కడ్డీలను అపహరించారు. దీనిపై కాకినాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ప్రత్యేక దృష్టి సారించి.. నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని ఆదేశించారు. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నేర స్థలంలో లభించిన వేలిముద్రలను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విశ్లేషించారు. ఈ క్రమంలో నవంబరు 17న నిందితుడిని గుర్తించారు. మూడో పట్టణ సీఐ కేవీఎస్ సత్యనారాయణ సిబ్బందితో కలిసి సూర్యనారాయణ పురంలోని అతడి నివాసం వద్ద బీర దుర్గా వెంకటేష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద గంజాయి లభించడంతో విచారించగా.. కాకర లోవరాజు అనే వ్యక్తి గంజాయిని తీసుకొచ్చి తన వద్ద ఉంచినట్లు వెల్లడించాడు. దీంతో లోవరాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో నిందితులిద్దరూ చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఏ-1 బీర దుర్గా వెంకటేష్‌పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 21 దొంగతనం కేసులు, ఏ-2 కాకర లోవరాజుపై సుమారు 28 దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏ-1 దొంగతనాలకు పాల్పడి వచ్చిన సొమ్ములో కొంత వాటాను ఏ-2కు ఇచ్చేవాడని, తాను పోలీసులకు పట్టుబడితే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు సహకరించాలని కోరేవాడని విచారణలో తేలింది.
ప్రస్తుత చోరీ అనంతరం కూడా బెయిల్ అవసరాల కోసం ఏ-2 వద్ద కొంత నగదు ఉంచినట్లు వెల్లడైంది. ఇప్పటికే పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉండటంతో పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఇకపై దొంగతనాలు చేయకుండా గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏ-2 లోవరాజు కొన్ని రోజుల క్రితం చింతపల్లికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి కాకినాడకు తీసుకొచ్చాడు. కొంత గంజాయిని విక్రయించి, మిగిలిన దానిని ఏ-1 వద్ద ఉంచి ఇద్దరూ కలిసి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుత చోరీతో పాటు కడియం గ్రామంలోని ఓ వైన్ షాపు, నడకుదురు గ్రామంలోని ఓ ఇల్లు, కాకినాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మార్కెట్ ప్రాంతంలోనూ ఏ-1 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి వివిధ కేసులకు సంబంధించి రూ.10 లక్షల నగదు, తొమ్మిది వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మరో చోరీ కేసులో పది ఉన్ని స్వెట్టర్లు, ఇంకో కేసులో రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.