NATS Service Programs: తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగు వర్గాలు, ప్రత్యేక అవసరాలున్న వారి అభ్యున్నతే లక్ష్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) సహాయక కార్యక్రమాలను చేపట్టింది. ‘సంబరంలో సేవ’ నినాదంతో సమకూర్చిన రూ.80 లక్షల నిధులను సమాజంలో అత్యంత ఆదరణ కరవైన వర్గాల కోసం సద్వినియోగం చేస్తూ సంస్థ తన సామాజిక బాధ్యతను చాటుకుంది. సెప్టెంబర్ 20న నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, న్యూజెర్సీ ప్రతినిధి సాయి గంగుల, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోని ‘హృదయాలయం’ ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తులో దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వృత్తి విద్యా శిక్షణ కేంద్రాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు.
చిన్నారులకు అందుతున్న ఫిజియోథెరపీ, పరివర్తన తరగతుల తీరును పరిశీలించి, వారితో కాసేపు ముచ్చటించి మిఠాయిలు పంచారు. మారుమూల, అటవీ ప్రాంతాల్లోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకూ ఇలాంటి చేయూత దక్కేలా మరిన్ని కేంద్రాలు విస్తరించాల్సిన అవసరం ఉందని వారు ఆకాంక్షించారు. శారీరక లోపాలు ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా నాట్స్ స్వయం ఉపాధి పథకాలను అమలు చేసింది. తొర్రేడు గ్రామానికి చెందిన గోపి, వెంకటానగర్ వాసి దేవదాసు చినబాబులకు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ దుకాణాలను నాట్స్ ప్రతినిధులు స్వయంగా ప్రారంభించి వారికి అండగా నిలిచారు.
వెన్నెముక తీవ్రంగా దెబ్బతిని మంచానికే పరిమితమైన నిస్సహాయుల కోసం ‘హోప్ 4 స్పందన’ సంస్థ సమకూర్చుతున్న నెలవారీ ఆరోగ్య రక్షణ కిట్ల పంపిణీకి నాట్స్ తోడ్పాటునిస్తోంది. హైదరాబాద్‌లో రాజ్ అల్లాడ పరిశీలించిన ఈ కిట్లలో యూరిన్ బ్యాగులు, డైపర్లు, క్యాథెటర్లు, డెట్టాల్, బెటాడిన్, దూది, గ్లౌజులు సహా 13 రకాల వైద్య అత్యవసరాలున్నాయి. అంతేకాకుండా అనంతపురం ‘ఆశ్రయ’, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథాశ్రమాల్లో నిరాశ్రయులకు శాశ్వతంగా ఆశ్రయం కల్పించే ప్రాజెక్టులకు సైతం సంస్థ ఆర్థిక సహకారం అందిస్తోంది.
ఈ సేవా యజ్ఞానికి తెలుగు రాష్ట్రాల ‘హోప్ 4 స్పందన’ సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడి పర్యవేక్షకులుగా వ్యవహరించారు. నిడదవోలు, రాజమండ్రిలలో చేపట్టిన ఈ కార్యక్రమాల్లో హృదయాలయం వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ గణేష్ బాబు, నిర్వాహకులు డాక్టర్ బలగం విశాలాక్షి, దయ్యాల మహేష్‌లు పాలుపంచుకున్నారు. సొంతగడ్డపై అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రవాసాంధ్రులందరికీ నాట్స్ ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల సమగ్ర వికాసం కోసం తమ నిరంతర సహాయ సహకారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.