SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Politics: ఆ సెగ్మెంటులో పొలిటికల్ డ్రామా.. తాత, మనవరాలి మధ్య అసలైన గేమ్..!

AP Politics: కాకినాడ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది..! నిన్న మొన్నటి వరకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పుడు పొత్తులు అంటూ తిరుగుతున్నారు..! తాజాగా వైసీపీలో నుంచి ఓ సీనియర్ నేత.. జనసేన కండువా కప్పుకున్నారు.. ఇలా పొత్తులో ఉన్న పార్టీలో ఆయన చేరారో లేదో.. అప్పుడే తాతకు దగ్గులు నేర్పకు అన్నట్టుగా కామెంట్లు మొదలుపెట్టేశారా..! మరి ఈ పొత్తు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది..! ఇంత ఓ రేంజ్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ నియోజకవర్గం ఏంటి..?

Reported By Gurram Shekar Written By Ashok Krindinti
Published: Oct 07, 2026, 07:06 PM IST | Updated: Oct 07, 2026, 07:09 PM IST
Image Credit: AP Politics
Join

AP Politics: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మెట్ట ప్రాంతం. ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీల వారు సమీప బంధువులే. ఎన్నికల వరకు కొట్లాడుతారు. ఎన్నికల తరువాత అధికారంలో ఉన్న వారితో పని చేయించుకునేందుకు బంధుత్వాలు కలుపుతారు. అవసరమైతే కేసులు పెడతారు. అలాంటి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున 2024 ఎన్నికలలో వరుపుల సత్య ప్రభ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తొలిసారి రాజకీయ అరంగేట్రం చేయాల్సి వచ్చింది. టిడిపిలో సీనియర్ అయిన ఆమె భర్త రాజా చనిపోవడంతో వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చి మొదటిసారి పోటీ చేసి భర్త సానుభూతి, కూటమి హవాలో గెలిచేశారు. అంతా సాఫీగా జరిగిపోతోంది అనుకున్న సమయంలో ఆమెకు ఇప్పుడు ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురవుతోంది.. 

ఇప్పుడుప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీని వీడి జనసేనలో చేరడంతో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరిగాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న సుబ్బారావు ఎలాంటి పదవి, ప్రత్యేక హామీ కోరలేదని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ, వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు ప్రత్యర్థులుగా పోటీ చేశారు. కానీ ప్రజలు సత్యప్రభకే పట్టం కట్టారు. ఇప్పుడు ఇద్దరూ కూటమి రాజకీయాల్లో భాగస్వాములు కావడంతో నియోజకవర్గంలో కొత్త సమన్వయం అవసరమైంది. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో సుబ్బారావుకు ఉన్న రాజకీయ పరిచయాలు, అనుచర వర్గం జనసేనకు అదనపు బలంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే పార్టీలో క్రియాశీలంగా ఉన్న నేతలకు బాధ్యతల పంపిణీ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు జనసేన ప్రత్తిపాడు ఇంచార్జ్ గా ఉన్న వరుపుల తమ్మయ్యబాబు ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవలే ఆయన చనిపోవడంతో ఈ నియోజకవర్గానికి ఇంచార్జి లేకుండా పోయారు. కొద్దిరోజులుగా ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి ప్రత్తిపాడులో యాక్టివ్ అయ్యారు. అలాగే తమ్మయ్య బాబు భార్య, కుమారుడు, అలాగే మరో నేత మేడిశెట్టి  బాబీ కూడా జనసేన పేరిట తిరుగుతున్నారు. తాజాగా వారికి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తోడయ్యారు. అయితే ఇక్కడ టీడీపీ-జనసేన మధ్య స్థానిక స్థాయిలో సమన్వయం కూడా కీలకంగా మారనుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో సుబ్బారావు పాత్ర కీలకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో వైసిపీకి కూడా ప్రత్తిపాడులో తన గ్రామస్థాయి నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే వరువుల సుబ్బారావు చేరికతో జనసేనకు రాజకీయ బలం పెరగడంతో పాటు పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ ప్రత్తిపాడు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలక అంశాలుగా మారనున్నాయి.

ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్య ప్రభ, మాజీ ఎమ్మెల్యే సుబ్బారావుపై 2024 ఎన్నికలలో గట్టి పోరాటమే చేశారు. అంతకుముందు సత్యప్రభ భర్త రాజా డిసిసిబి చైర్మన్ గా ఉంటూ కొన్ని సొసైటీలలో బినామీ పేరిట కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వైసీపీలో ఉన్న సుబ్బారావు ప్రోద్భలంతోనే ఈ కేసులు పెట్టారు అన్న ప్రచారం జరిగింది. కేసులు తట్టుకోలేక ఓ దశలో వరుపులు రాజా పార్టీ కూడా మారారు. 

అప్పట్లో హైకోర్టు నుంచి అరెస్టు కాకుండా ఆయన ఆర్డర్ తెచ్చుకుని కొనసాగారు. ఇదే టెన్షన్ తో గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సతీమణి సత్య ప్రభకు పార్టీ ఇంచార్జ్ పదవి ఇచ్చి ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చి ఆర్థిక సహాయం కూడా పార్టీ చేసిందని ప్రచారం ఉంది. ఇప్పుడు తాత, మనవరాలు టిడిపి, జనసేనలో ఉన్నారు సరే. మా పరిస్థితి ఏంటని టిడిపి, జనసేనకి చెందిన పాత కాపులు ప్రశ్నిస్తున్నారు. 2029 ఎన్నికల్లో సత్య ప్రభకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఈ స్థానంపై జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కన్నేశారని ప్రచారం సాగుతోంది. అలాగే వైసీపీ నుంచి వచ్చిన వరుపుల సుబ్బారావుకు పొత్తులో టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదని అంటున్నారు. మరోవైపు బార్లపూడి క్రాంతి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఏదీఏమైనా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు వరుపుల సుబ్బారావు జనసేనలో చేరడం ఏమాత్రం ఇష్టంలేదన్న చర్చ జరుగుతోంది. కానీ ఆమె అభిప్రాయాన్ని ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా టిడిపి నేతలు పట్టించుకోలేదని చెబుతున్నారు. కానీ టిడిపికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే దగ్గరుండి వరుపుల సుబ్బారావును జనసేనలో చేర్చారని మరో వర్గం ప్రచారం చేస్తోంది. మొత్తంమీద నిన్న మొన్నటి వరకు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుని కత్తులు దూసుకున్న తాత మనవరాలు ఇప్పుడు మిత్రబక్షంగా మారారు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఏం చేస్తారు.. రాజకీయం ఎలా ఉంటుంది.. జనసేన పాత కాపుల పరిస్థితి ఏమిటి? టిడిపిలో కొత్త కుంపట్లు మొదలవుతాయా.. సత్య ప్రభ జనసేనను కలుపుకొని వెళ్తారా.. ఇవీ ఇప్పుడు పత్తిపాడులో జరుగుతున్న వాడి వేడి పొలిటికల్ చర్చగా తెలుస్తోంది. 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES