SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆ నియోజకవర్గంలో కూటమికి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే భార్య ఓటమి.. 30 స్థానాల్లో వైసీపీ గెలుపు..!

ZPTC MPTC Election Results: రాజానగరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వైసీపీలో కొత్త జోష్ నింపాయి. అధికార కూటమి పార్టీలకు దీటుగా వైసీపీ అభ్యర్థులు పలు స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. మొత్తం 71 స్థానాలకు గాను 30 చోట్ల గెలుపొందారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి పోటీ చేసిన జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Written By Ashok Krindinti
Published: Nov 08, 2026, 03:53 PM IST | Updated: Nov 08, 2026, 03:56 PM IST
Image Credit: ZPTC MPTC Election Results
Join

ZPTC MPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌లో ZPTC, MPTC ఎన్నికల ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలు సత్తాచాటాయి. అయితే రాజానగరం నియోజకవర్గంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అధికార కూటమి పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ.. మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు గాను 30 స్థానాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సీతానగరం, కోరుకొండ మండలాల్లో సాధించిన విజయాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో అధికార కూటమి పార్టీలతో పోటీపడిన వైసీపీ అభ్యర్థులు మొత్తంగా 30 స్థానాల్లో గెలుపొందడం విశేషం. మొత్తం 71 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. దాదాపు సగం స్థానాల్లో విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీతానగరం మండలంలో వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఇక్కడ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలతో పాటు 12 ఎంపీటీసీ స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన పోరు ప్రత్యేకంగా నిలిచింది. జనసేన తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు 2,007 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన అభ్యర్థిపై గెలవడం వైసీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.

కోరుకొండ మండలంలోనూ వైసీపీ తన పట్టును చాటుకుంది. మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 స్థానాలను గెలుచుకుంది. అంతేకాకుండా ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకుంది. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులతో పోటీపడి మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను సాధించడం పార్టీకి కలిసొచ్చింది.

జక్కంపూడి రాజా నాయకత్వంలో..

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ గెలుచుకున్న ఏకైక జడ్పీటీసీ స్థానం సీతానగరం కావడం ఈ ఫలితాల్లో మరో కీలక అంశం. అందులోనూ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నేతృత్వంలో పార్టీ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కూటమి పార్టీలకు గట్టి పోటీనిస్తూ 30 స్థానాలను సాధించడం వైసీపీకి స్థానికంగా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES