Bank of Baroda Festive Offers: మీరు పండుగ సీజన్‌లో ఇల్లు లేదా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా.. తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ గ్రీన్ వీల్స్ స్కీమ్ అనే పేరుతో తన పండుగ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కింద, హోంలోన్స్, కార్ లోన్లు, ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్, పొదుపు ఉత్పత్తులు, డెబిట్ కార్డ్ ఖర్చులపై వివిధ ప్రయోజనాలు అందిస్తోంది. ఈ ప్రచారం వినియోగదారులకు వారి పండుగ షాపింగ్.. ఆర్థిక అవసరాలను తీర్చడాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, స్పెషల్ డిస్కౌంట్లు, ప్రాసెసింగ్ ఫీజులు తగ్గింపు, ప్రత్యేక పండుగ ఆఫర్లను అందిస్తోంది.
ఈ పండగ సీజన్లో వినియోగదారులకు మరింత చేరువయ్యే విధంగా 7.40శాతం ప్రారంభ వడ్డీతో హోంలోన్ అందిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. వీటిపై ప్రాసెసింగ్ ఫీజులు పూర్తిగా రద్దు చేయడంతోపాటుగా కనీస డాక్యుమెంటేషన్ తో వేగంగా లోన్స్ మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాలు కొనుగోలు కోసం జాబ్ స్వభూమి ప్లాట్ లోన్స్ కూడా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో, సుదీర్ఘ కాలపరిమితితో అందిస్తున్నట్లు పేర్కొంది. మహిళా దరఖాస్తుదారులకు వడ్డీ రేటులో అదనంగా 0.05 శాతం.. 40ఏండ్ల లోపు యువత, ప్రభుత్వ కార్పొరేట్ ఉద్యోగులు, హెచ్ఎన్ఐ వినియోగదారులకు 0.10 శాతం వరకు ప్రత్యేక వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.
వెహికల్ లోన్ విభాగంలో 7.85శాతం ప్రారంభ వడ్డీకే కార్ లోన్స్ ను మంజూరు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇక ఈవీల కొనుగోలును మరింత ప్రోత్సహించేందుకు బాబ్ గ్రీన్ వీల్స్ స్కీమ్ ను అదనంగా 0.15 శాతం వడ్డీ డిస్కౌంట్ తో పాటు చెల్లింపుల గడువును పొడిగించింది. అలాగే పండగ షాపింగ్, జర్నీ, కిరాణా సరుకులు, రెస్టారెంట్ బిల్లుల చెల్లింపులపై బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగదారులకు పలు వాణిజ్య సంస్థల భాగస్వామ్యంతో తక్షణ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహించేందుకు బాబ్ ఫ్లెక్సీ సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ కింద నెలకు కేవలం రూ. 500 నుంచే పెట్టుబడి పెట్టే ఛాన్స్ కల్పించింది.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషల్ సేవింగ్ స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఎన్నారై మహిళల కోసం బాబ్ గ్లోబల్ విమెన్ ఎన్ఆర్ఈ , ఎన్ఆర్వో సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఉచిత ప్రమాద బీమా, ఆటో స్వీప్ వెసులుబాటు కల్పించింది. బాబ్ విమెన్ సఫైర్ అకౌంట్ ఉన్నవారికి రూ. 10లక్సల వరకు క్యాన్సర్ కేర్ కవరేజీ, ఫ్రీ ఆన్ లైన్ డాక్టర్ కన్సల్టేషన్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఎంఎస్ఎంఈల విస్తరణ కోసం బాబ్ గ్రీన్ ప్లగ్ ద్వారా ఈవీ ఛార్జీంగ్ కేంద్రాలు, బ్యాటరీ స్వాపింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. 5కోట్ల వరకు లోన్స్ సమకూర్చుతున్నట్లు స్పష్టం చేసింది.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం బరోడా మహిళా స్వావలంబన్ పేరుతో ఎలాంటి పూచీకత్త లేకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే బిజినెస్ లోన్స్ అందిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. పండగ వేళ ప్రతి కుటుంబం కలలను సాకారం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.