Bank Strike Break: ఐదు రోజుల పనిదినాలతోపాటు పని ఒత్తిడి తగ్గించడం.. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో నేటి నుంచి జరగాల్సిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. మూడు రోజుల పాటు ప్రారంభం కావాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల తమ సమ్మె విరమించుకుంటున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.
తమ పోరాటాన్ని వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీఐ) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో ఆదివారం రాత్రి 9.30 గంటలకు జరిగిన కీలక సమావేశంలో చర్చలు జరిగాయి. ఐబీఏ ముందు బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లు, సమస్యలు వివరించారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లతో పాటు పలు అంశాలపై ఐబీఏ ప్రతినిధులతో చర్చించారు.
ఈ చర్చలలో సానుకూల నిర్ణయాలు రావడంతో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు చేపట్టాల్సిన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ ప్రకటన జారీ చేసింది. సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో నేడు సోమవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పని చేయనున్నాయి. మూడు రోజులపాటు బ్యాంకులు బంద్ ఉంటాయని భావించిన ఖాతాదారులు, వినియోగదారులకు ఊరట లభించింది. అయితే అర్ధరాత్రి సమ్మెను వాయిదా వేయడంతో బ్యాంకు ఉద్యోగులు గందరగోళంలో పడ్డారు. ఇంతకు ఏమీ జరిగింది? ఎందుకు అకస్మాత్తుగా వాయిదా వేశారని బ్యాంకు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
ఐదు రోజుల పనివిధానంపై కదలిక
బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఐదు రోజుల పనివిధానంపై కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి పూట జరిగిన చర్చల్లో ఐబీఏ వారంలో రెండు సెలవులకు అంగీకరించినట్లు సమాచారం. తమకు సానుకూల నిర్ణయం రావడంతో వెంటనే బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెను వాయిదా వేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.