Dearness Allowance Hike: దేశంలోని సుమారు కోటిమందికిపైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది మోదీ సర్కార్. జులై 2026 కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ చెల్లించేందుకు సిద్ధమవుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగ సంఘాల సమాచారం ప్రకారం.. పండగ సీజన్ లో ముఖ్యంగా దసరాకు ముందే ప్రభుత్వం డీఏ పెంపును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ పెంపు అమల్లోకి వచ్చినట్లయితే.. 50లక్షలకు పైగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమారు 69 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెల జీతాలతో పాటు పెరిగిన అలవెన్స్ బకాయిలు కూడా అందుతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
అయితే ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ పటేల్ అలాగే.. కాన్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ తో కలిసి పండగ నేపథ్యంలో త్వరగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగాన్ని కోరారు. జులై 1.2026 నుంచి చెల్లించాల్సిన డీఏ, డీఆర్ తర్వాతి విడతకు సంబంధించిన ప్రకటనను దసరా పండగకు ముందే చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 60శాతం చొప్పున డీఏ పొందుతున్నారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ గణాంకాల ఆధారంగా ఈసారి డీఏలో 3శాతం నుంచి 4శాతం వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 3 లేదా 4శాతం పెంపును ఆమోదించినట్లయితే.. మొత్తం డీఏ 63 లేదా 64శాతానికి పెరుగుతుంది. జులై 2026 కాలానికి అవసరమైన మొత్తం 12నెలల కన్య్సూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇది డీఏ పెంపు చేసేందుకు స్పష్టమైన మార్గంగా నిర్దేశించింది.
జులైకి సంబంధించిన డీఏ ప్రభుత్వం గత 12 నెలల సగటు AICPI-IW సూచిక ఆధారంగానే లెక్కిస్తుంది. జులై 2026లో సూచిక 153.2 ఉంటే.. గత 12నెలల సగటు 149.21గా నమోదు అయ్యింది. గణాంకాల ప్రకారం డీఏ విలువ 64.40 శాతంగా తేలింది. అయితే తుది రేటు 63శాతమా లేదంటే 64శాతమా అనేది కేంద్రం నిర్ణయిస్తుంది. జులై 2026 డీఏకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉండగానే.. తదుపరి సైకిల్ అంటే జనవరి 2027 కు సంబంధించిన డీఏకు సంబంధించిన అంచనాలు వెలువడుతున్నాయి. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ ఇటీవల ఆగస్టు2026నాటి AICPI-IW గణాంకాలను రిలీజ్ చేసింది. ఆగస్టులో సూచిక 1.2పాయింట్లు పెరిగి 154.4కు చేరుకుంది. దీని ఆధారంగా జనవరి 2027 నాటి నుంచి వర్తించే డీఏను నిర్ణయించనున్నారు.