Diwali Shopping: దీపావళికి కొత్త వస్తువులు కొంటున్నారా..? పండుగకు ముందే ధరల మంట..!
Diwali Price Hike: పండుగ సీజన్‌లో కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం చాలామంది కుటుంబాల్లో ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, గీజర్లు వంటి గృహోపకరణాలకు ఈ సమయంలో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి వినియోగదారులకు ధరల పెరుగుదల రూపంలో అదనపు భారం ఎదురవుతోంది.
Diwali Price Hike: దీపావళి పండుగ వచ్చిందంటే మార్కెట్లు కళకళలాడుతాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లు, ఇంటి అలంకరణలు, స్వీట్ల సందడి మొదలవుతుంది. అయితే ఈసారి ధన్‌తేరస్ సందర్భంగా టీవీలు, గీజర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని ప్లాన్ చేసేవారికి అదనపు ఖర్చు తప్పేలా లేదు. ఇప్పటికే పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగగా.. సంప్రదాయ స్వీట్ల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇంతకీ ఏ వస్తువుల ధరలు ఎంత పెరిగాయి..? ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటి..? ఇక్కడ తెలుసుకుందాం..
తాజా నివేదికల ప్రకారం.. కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు ఇప్పటికే 3 నుంచి 7 శాతం వరకు పెరిగాయి. Haier, LG, బ్లూ స్టార్ వంటి సంస్థల వస్తువులలో ధరల పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు Havells కూడా డిసెంబర్ త్రైమాసికంలో 5 నుంచి 7 శాతం వరకు ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక దీపావళి వేడుకల్లో స్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బంధుమిత్రులకు బహుమతులుగా ఇవ్వడం.. ఇంటికి వచ్చే అతిథులకు అందించడం వంటి కారణాలతో పండుగ సమయంలో స్వీట్ల కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈసారి స్వీట్ల ధరలు కూడా వినియోగదారులకు భారంగా మారుతున్నాయి.
గతంతో పోలిస్తే కొన్ని సంప్రదాయ స్వీట్ల ధరలు దాదాపు 15 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాలు, ఖోవా, చక్కెర, డ్రై ఫ్రూట్స్ వంటి ప్రధాన ముడిసరుకుల ధరలు పెరగడమే ఇందుకు ముఖ్య కారణం. తయారీ ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాలు కూడా పెరగడంతో స్వీట్ల వ్యాపారులు ధరలను సవరించాల్సి వస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, స్వీట్ల ధరలు ఒకేసారి పెరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడం ఎలక్ట్రానిక్స్ రంగంపై ప్రభావం చూపుతున్నాయి.
ఇక స్వీట్ల తయారీ విషయానికి వస్తే పాల ఉత్పత్తులు, చక్కెర, డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగడంతో వ్యాపారులపై ఖర్చుల భారం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గడం కూడా డ్రై ఫ్రూట్స్ సరఫరా, ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలన్నీ కలిపి పండుగ కొనుగోళ్లను ఖరీదైన వ్యవహారంగా మారుస్తున్నాయి. అయితే ధరలు పెరుగుతున్నా.. పండుగ సమయంలో కొనుగోళ్లపై ఆసక్తి తగ్గడం లేదని రిటైల్ రంగం చెబుతోంది. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించకుండా EMI సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రస్తుతం వారి వద్ద జరుగుతున్న కొనుగోళ్లలో దాదాపు 70 శాతం EMI విధానంలోనే జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు మొత్తం మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీపావళి షాపింగ్‌కు సిద్ధమవుతున్నవారు ధరల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని అంటున్నారు. ఒకే ఉత్పత్తికి వేర్వేరు షాపుల్లో ఉన్న ధరలను పోల్చుకోవాలని.. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లు నిజంగా ఎంత మేరకు ప్రయోజనం కలిగిస్తున్నాయో పరిశీలించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా EMI ద్వారా కొనుగోలు చేసేటప్పుడు వడ్డీ, ప్రాసెసింగ్ ఛార్జీలు, మొత్తం చెల్లించాల్సిన మొత్తాన్ని ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈసారి పండుగ సందడి ఉన్నా.. పెరిగిన ధరలు మాత్రం సామాన్య కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశముంది.