EPF Instant UPI Withdrawal: చందాదారుల అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఈపీఎఫ్ఓ సరికొత్త డిజిటల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే యూఏఎన్ (UAN) పోర్టల్ ద్వారా క్లెయిమ్ నమోదు చేసి, అధికారులు పరిశీలించి అనుమతించే వరకు రోజులకు రోజులు సమయం పట్టేది. అయితే, నూతన విధానంలో UAN పోర్టల్ నేరుగా సబ్‌స్క్రైబర్ల యూపీఐ ఐడీతో అనుసంధానం కానుంది. దీనివల్ల మధ్యలో సమయం వృథా కాకుండా నేరుగా చందాదారుల బ్యాంక్ ఖాతాల్లోకి విత్‌డ్రా సొమ్ము అత్యంత వేగంగా జమ అవుతుంది.
ప్రత్యేక యాప్, భీమ్ (BHIM) అనుసంధానం..
చందాదారులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ ఒక ప్రత్యేక నూతన యాప్‌ను కూడా రూపొందిస్తోంది. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వపు 'భీమ్' (BHIM) యాప్‌తో పాటు ఇతర ప్రముఖ యూపీఐ యాప్‌లతో అనుసంధానమై పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా విత్‌డ్రా అభ్యర్థనలను పంపుకోవచ్చు. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు డిజిటల్ రూపంలో మహత్తర ప్రయోజనం చేకూరుతుంది.
విత్‌డ్రా పరిమితులు, అర్హతలు..
యూపీఐ విధానంలో గరిష్టంగా 75 శాతం నిధులను మాత్రమే డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇల్లు లేదా స్థలం కొనుగోలు, వైద్య అత్యవసరాలు వంటి ప్రత్యేక కారణాల నిమిత్తం ఈ 75 శాతం సొమ్మును పొందే అర్హత ఉంటుంది.
రిటైర్మెంట్ భద్రత, పన్ను రహిత వడ్డీ..
అత్యవసరాల కోసం ఎంత డ్రా చేసుకున్నా, ఖాతాలోని మొత్తం నిధిలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ నిల్వ ఉండటం తప్పనిసరి. ఈ మిగిలిన 25 శాతం సొమ్ము చందాదారుడి పీఎఫ్ ఖాతాలోనే భద్రంగా ఉండి, దానిపై ప్రభుత్వం అందించే పన్ను రహిత వడ్డీ యథావిధిగా జమ అవుతూ ఉంటుంది.
ఇది చందాదారుల భవిష్యత్తు రిటైర్మెంట్ అవసరాలకు ఆర్థిక భద్రతను అందిస్తూనే, తక్షణ అత్యవసరాలకు అవసరమైన నగదును వేగంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వద్ద దాదాపు రూ. 26 లక్షల కోట్ల భారీ కార్పస్ నిధి ఉండగా, ప్రతినెల క్రమం తప్పకుండా చందా చెల్లించే యాక్టివ్ చందాదారులు సుమారు 7.5 కోట్లుగా ఉన్నారు.